Gold Price Today

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

Gold Price Today: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకు కాస్త షాకింగ్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్ళీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. “నేనేం తక్కువ కాదు” అన్నట్లుగా పసిడి ధర పరుగులు పెడుతుంటే, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ధరలు భారీగా పెరగడంతో, కొనుగోలుదారులు మళ్ళీ ఆందోళనలో పడిపోయారు. నిన్న ఒక్క రోజే తులం బంగారంపై రూ. 2 వేలకు పైగా పెరగడం విశేషం.

ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ గమనిస్తే.. ఫిబ్రవరి 24వ తేదీ నాటికి మన తెలుగు రాష్ట్రాల్లో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,360 కి చేరుకుంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,910 వద్ద కొనసాగుతోంది. ఒకప్పుడు తులం బంగారం లక్ష రూపాయలు దాటడమే ఆశ్చర్యంగా ఉండేది, కానీ ఇప్పుడు అది ఏకంగా లక్షా అరవై వేల మార్కును దాటేయడం గమనార్హం.

మరోవైపు వెండి ధరలు కూడా అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ఇటీవల కిలో వెండి ధర 4 లక్షల వరకు వెళ్లి, ఆ తర్వాత లక్ష రూపాయల వరకు తగ్గి ఉపశమనాన్ని ఇచ్చింది. కానీ, గత రెండు రోజులుగా మళ్ళీ సీన్ మారింది. నిన్న ఒక్క రోజే కిలో వెండిపై ఏకంగా రూ. 25,000 పెరగడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 3,00,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే చెన్నైలో బంగారం ధరలు మరికాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,62,120 గా ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఇవే భారీ ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరలు ఇలా పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. శుభకార్యాల సీజన్ వస్తుండటంతో ఈ పెరుగుదల మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *