Gold Price Today: గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ సామాన్యులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా రూటు మార్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభంలోనే పసిడి ధరలు మళ్లీ పుంజుకోవడం ఆరంభించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ విలువ స్వల్పంగా తగ్గడంతో, పెట్టుబడిదారులు తమ దృష్టిని బంగారం వైపు మళ్లించారు. దీని ప్రభావంతో బుధవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.3 వేలకు పైగా పెరగడం విశేషం. నేడు గురువారం కూడా ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.
ప్రస్తుతం మన దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,960కి చేరుకుంది. నిన్నటితో పోల్చితే ఈరోజు సుమారు రూ.10 పెరిగింది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.1,40,210 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ఇది ప్రస్తుతం రూ.1,14,710 వద్ద ఉంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ పెరుగుదల కొనుగోలుదారులపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,960గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,210 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,53,110గా ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ.1,53,280 వద్ద ట్రేడవుతోంది. స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల వల్ల నగరాల మధ్య ఈ చిన్నపాటి ధరల వ్యత్యాసం ఉంటుంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. కిలో వెండి ధరపై తాజాగా రూ.100 పెరిగింది. దేశవ్యాప్తంగా సగటున కిలో వెండి ధర రూ.2,55,100 వద్ద ఉండగా, హైదరాబాద్‌లో మాత్రం ఇది రూ.2,65,100 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, డాలర్ విలువలో మార్పుల కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరిన్ని హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
