Gnanesh kumar: ఓటర్ల జాబితా సవరణ నెక్స్ట్ తెలంగాణలోనే

Gnanesh kumar: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (Special Intensive Revision – SIR)లో తెలంగాణ త్వరలోనే దేశానికే రోల్ మోడల్‌గా నిలవనుందని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అన్నారు. తదుపరి దశ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం తెలంగాణలోనే నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బూత్ స్థాయి అధికారుల (BLOs) సమావేశంలో మాట్లాడిన సీఈసీ, ఇటీవల బీహార్‌లో విజయవంతంగా అమలు చేసిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తెలంగాణలో కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. బీహార్‌లో సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదని, రీపోలింగ్ లేదా రీకౌంటింగ్ అవసరం రాలేదని గుర్తుచేశారు. ఈ విజయానికి కారణమైన బీహార్ బీఎల్‌వోలను ఆయన అభినందించారు.

భారత ఎన్నికల వ్యవస్థకు బూత్ స్థాయి అధికారులే వెన్నెముక అని జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన విజయవంతం కావాలంటే బీఎల్‌వోల నిబద్ధత, కృషి ఎంతో కీలకమని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గడానికి ఓటర్ల ఉదాసీనతే ప్రధాన కారణమని తెలిపారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు ఉత్సాహంగా క్యూలలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటూ దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారని ప్రశంసించారు.

ప్రపంచవ్యాప్తంగా భారత ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి పెరుగుతోందని సీఈసీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 90 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. 1995లో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (IDEA)లో సభ్యదేశంగా చేరిన భారత్, మూడు దశాబ్దాల తర్వాత ఆ సంస్థకు ఛైర్మన్‌గా అవతరించడం గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీనియర్ డిప్యూటీ సీఈసీ పవన్ కుమార్ శర్మ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *