Nepal Gen Z Protest: నేపాల్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడి, ఓలీ ప్రభుత్వాన్ని కూలదోసిన జెన్-జెడ్ నాయకులు ఇప్పుడు తమలోతాము విభజనకు గురై, అధికారం కోసం తన్నులాట ప్రారంభించారు. ఖాట్మండు ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద వర్గాలుగా విడిపోయిన జెన్-జెడ్ నేతలు పరస్పరం ఘర్షణకు దిగారు.
తాత్కాలిక ప్రధానిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, దేశ రాజకీయ వాతావరణం మళ్లీ గందరగోళంలోకి జారుకుంది. బాలెన్ షా, సుశీలా కర్కి వర్గాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తగా, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజినీర్ మరియు నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ చీఫ్ కుల్మన్ ఘిసింగ్ పేరు ముందుకు వస్తోంది.
కుల్మన్ ఘిసింగ్ – శుభ్రమైన ఇమేజ్, ప్రజల మద్దతు
కుల్మన్ ఘిసింగ్‌కు నేపాల్ ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. దేశంలో విద్యుత్ సమస్యను అధికంగా పరిష్కరించిన వ్యక్తిగా ఆయన పేరు పొందారు. క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా ప్రజలు ఆయన్ను నమ్ముతున్నారు. అందుకే జెన్-జెడ్ నిరసనకారులు, కొంతమంది నేతలు ఆయనను తాత్కాలిక ప్రధానిగా అంగీకరించేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఇది కూడా చదవండి: KTR: ‘గ్రీన్ లీడర్‌షిప్’.. కేటీఆర్‌కు దక్కిన అరుదైన గౌరవం
అయన విద్యార్హతలు కూడా విశేషమే. ఇండియాలోని జంషెడ్‌పూర్ రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, తరువాత నేపాల్ పుల్‌చోక్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ఎంబీఏ కూడా చేశారు.
బాలెన్ షా – సుశీలా కర్కి వెనక్కి
తాత్కాలిక ప్రధాని రేసులో కాఠ్మాండు మేయర్ బాలెన్ షా, మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ముందంజలో ఉన్నప్పటికీ, ఇప్పుడు వారి పేర్లు వెనక్కి నెట్టబడ్డాయి. వయసు కారణంగా సుశీలా కర్కిపై విమర్శలు రావడం, అలాగే మాజీ న్యాయమూర్తులు రాజ్యాంగపరంగా ప్రధానిగా ఉండలేరనే అభిప్రాయాలు రావడం వల్ల ఆమె అవకాశాలు తగ్గిపోయాయి.
సరిహద్దు భద్రత కఠినతరం
ఇక మరోవైపు, నేపాల్‌లో హింస కొనసాగుతుండటంతో, ఇండో-నేపాల్ సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. నేపాల్ జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు భారత్‌లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు 60 మందికి పైగా ఖైదీలను భారత సరిహద్దు భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కీలకం
ప్రస్తుతం నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటే పరిస్థితులను సర్దుబాటు చేసే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ అన్ని వర్గాలను చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేశారు. భారతీయుల తరలింపు ప్రక్రియ కూడా వేగవంతం అవుతోంది. రెండు ఎయిర్ ఇండియా విమానాలు ఖాట్మండు చేరుకున్నాయి.
నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి ఎవరూ నాయకత్వం వహిస్తారనే ప్రశ్నకు సమాధానం వచ్చే వరకు, దేశ రాజకీయ వాతావరణం గందరగోళంగానే ఉండనుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కుల్మన్ ఘిసింగ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.