Gaza War: గాజాలో యుద్ధం ముగింపునకు అమెరికా సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ అంగీకరించింది. గాజాలో పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు శ్వేతసౌధంలో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన ఇరువురు దేశాధినేతలు…. తమ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించకుంటే ఆ ఉగ్రసంస్థను అంతం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో త్వరలో యుద్ధం ముగియబోతోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. శాంతి కోసం ట్రంప్ ప్రణాళికలకు మద్దతు తెలుపుతున్నానని నెతన్యాహు చెప్పారు. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్ కు ముప్పు ఉండకూడదని అన్నారు. హమాస్ నిరాయుధీకరణకు అనుగుణంగా తమ బలగాలు గాజా నుంచి వైదొలుగుతాయని వెల్లడించారు. భవిష్యత్తు భద్రత దృష్ట్యా మాత్రం చుట్టపక్కల బలగాలను మోహరిస్తామని నెతన్యాహు వివరించారు. మరోవైపు ఇటీవల ఖతార్ పై దాడి చేసినందుకు ఆ దేశానికి నెతన్యాహు క్షమాపణలు చెప్పారు. ట్రంప్ ఒత్తిడితోనే ఖతార్ ప్రధానికి నెతన్యాహు క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది.
