Gaurav gogoi: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై అనేక సందేహాలు నెలకొన్నాయని, వీటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు. లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
“రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్‌పై కొన్ని వివరాలు వెల్లడించారు. కానీ, ఉగ్రవాదులు పహల్గామ్ వరకు ఎలా చేరుకున్నారు? ఆ ప్రాంతంలో దాడికి ఎలా తెగబడ్డారు? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేదు” అని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు.
దేశ ప్రయోజనాల కోసం ప్రతిపక్షం తరఫున కొన్ని ప్రశ్నలు అడగడం తమ బాధ్యతగా చూస్తున్నామని, ఉగ్రవాదుల ప్రణాళికలను దేశం మొత్తం కలిసి ఎదుర్కొనాలని ఆయన అన్నారు. “పాకిస్థాన్ కుట్రలను ఏ విధంగా సాగనివ్వకూడదు. ఉగ్రవాదులు ఈ స్థాయిలో దాడి చేసి పరారయ్యేలా చేయడంలో ఎవరైనా సహకరించారా అనే దానిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు.
ఉగ్రదాడిలో చనిపోయిన వ్యక్తి భార్య తన భర్త మృతదేహంపై రాజకీయాలు చేయవద్దని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, “మన సమాజం విభేదాలతో చీలిపోవాలని పాకిస్థాన్ ఆశిస్తోంది. ఇది జరుగకుండా ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేయాలి” అని సూచించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, “ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం పక్షపాతంతో కాకుండా పారదర్శకంగా స్పందించాలి. దేశ భద్రత కోసం మేము ప్రభుత్వం వెంట ఉన్నాం” అని పేర్కొన్నారు.
గౌరవ్ గొగోయ్ చివరగా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్ము కాశ్మీర్‌లో శాంతి నెలకొని ఉందని కేంద్రం చెబుతున్నప్పటికీ, ఇటీవలి ఈ దాడి ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.