ONGC Gas Leak

ONGC Gas Leak: రాజోలులో గ్యాస్ లీక్..భారీగా ఎగిసిపడుతున్న రాకాసి మంటలు

ONGC Gas Leak: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామం సమీపంలో ఉన్న ఒక ఓఎన్‌జీసీ (ONGC) గ్యాస్ బావిలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయ్యింది. బావిలో మరమ్మత్తులు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా క్రూడ్ ఆయిల్ కలిసిన గ్యాస్ ఉవ్వెత్తున ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉదయం వేళ పొగమంచులా తెల్లటి గ్యాస్ మేఘాలు గ్రామాన్ని కమ్మేయడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఉలిక్కిపడ్డారు.

ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే గ్యాస్ లీకైన చోట మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు ఆకాశాన్ని తాకేలా ఎగసిపడుతుండటంతో పరిస్థితి భయానకంగా మారింది. గ్యాస్ ప్రభావం వల్ల చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలు, పంట పొలాలు గ్యాస్ వాసనతో నిండిపోయాయి. మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉందన్న ఆందోళనతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో ఎవరూ ఉండవద్దని పంచాయతీ అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ప్రస్తుతం గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. బాధితుల కోసం లక్కవరం కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే గ్రామంలోని సగానికి పైగా ఇళ్లను ఖాళీ చేయించి జనాలను అక్కడికి తరలించారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మరియు అగ్నిమాపక దళం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

మంటలను అదుపు చేసేందుకు మరియు గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ఓఎన్‌జీసీకి చెందిన ప్రత్యేక సాంకేతిక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది? సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి రాలేదు, కానీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడమే ప్రథమ కర్తవ్యంగా అధికారులు పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *