Adilabad: పట్టణంలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్ నగర్ కాలనీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి ఏటీఎం లాకర్‌ను కట్ చేసి అందులోని నగదును ఎత్తుకెళ్లారు.
దొంగలు తమ ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు చాకచక్యంగా వ్యవహరించారు. ఏటీఎంలోని సీసీ కెమెరాలపై బ్లాక్ స్ప్రే చల్లి, కెమెరాల కళ్లు గప్పి తమ పని కానిచ్చారు. అనంతరం నగదుతో అక్కడి నుండి పరారయ్యారు. ఈ సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
Also Read: Anil Ambani: ఢిల్లీలో అనిల్ అంబానీ రిలయన్స్ సంస్థలపై ఈడీ దాడులు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సీఐలు కర్రె స్వామి, సునీల్ కుమార్ ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వగా, చోరీకి గురైన నగదు ఎంత ఉందనే వివరాలను తెలుసుకున్నారు.
నాలుగు సంవత్సరాల విరామం తర్వాత జిల్లాలో ఏటీఎం దొంగతనాలు మళ్లీ మొదలవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్‌ను రప్పించి సంఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. దొంగలను పట్టుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

