Ganta srinivas: విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మనవడు గంటా జిష్ణు ఆర్యన్ అరుదైన ఘనత సాధించాడు. కేవలం 8 ఏళ్ల వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో జిష్ణు ఆర్యన్ ఈ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. కేవలం 60 సెకన్లలో 216 గోల్డెన్ రేషియో (స్వర్ణ నిష్పత్తి) దశాంశాలను అనర్గళంగా చెప్పి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంత చిన్న వయసులో క్లిష్టమైన గణిత నిష్పత్తిని గుర్తుంచుకుని చెప్పడం నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది.
జిష్ణు ఆర్యన్ తండ్రి రవితేజ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు కాగా, తల్లి శరణి, మంత్రి పొంగూరి నారాయణ కుమార్తె. రవితేజ–శరణి దంపతులు ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “నా మనవడు గంటా జిష్ణు ఆర్యన్ 60 సెకన్లలో 216 దశాంశాల గోల్డెన్ రేషియో చెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం ఎంతో గర్వంగా ఉంది. 8 ఏళ్ల పిన్న వయసులో అంతటి ఏకాగ్రత, గ్రహణశక్తిని ప్రదర్శించిన ఆర్యన్‌కు, అతడిని లక్ష్య దిశగా నడిపించిన తల్లిదండ్రులు రవితేజ, శరణిలకు హృదయపూర్వక అభినందనలు,” అని అన్నారు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జిష్ణు ఆర్యన్ ప్రతిభపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

