Ganta srinivas Rao: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నం ఫిల్మ్ క్లబ్ ను సమగ్రంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 2015లో విశాఖలో ఫిల్మ్ క్లబ్ ను ప్రారంభించామని, అయితే 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్లబ్ తన ఉద్దేశ్యాన్ని కోల్పోయిందని విమర్శించారు.
ఇటీవల ఫిల్మ్ క్లబ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియ కూడా అవకతవకలతో నిండినదిగా ఆయన ఆరోపించారు. ఫిల్మ్ క్లబ్ కు ప్రస్తుతం సుమారు 1,500 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు.
ఈ క్లబ్ కు స్థిరమైన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని కేటాయించాలని, వేదికగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. విశాఖపట్నం సినీ పరిశ్రమకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగం కలిగిన ప్రదేశమని, టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం విశాఖను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉందని చెప్పారు. ఇందుకోసం సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని, ఫిల్మ్ క్లబ్ పాత్ర కీలకమవుతుందని అభిప్రాయపడ్డారు.

