Gangula Kamalakar: తెలంగాణలో బలహీనవర్గాల (బీసీ) రిజర్వేషన్‌లపై చర్చ ముదురుతోంది. 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బిల్లుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉన్న చర్యగా సమర్థిస్తే, బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాత్రం దీని అమలుపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెడుతోంది: సీఎం రేవంత్
“వందేళ్ల తర్వాత కులగణన చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఇది మా ప్రభుత్వ సంకల్పం. పారదర్శకంగా బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్‌లకు అధికారాలు ఇచ్చాం. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా బలహీనవర్గాల హక్కులు కాపాడతాం,” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అలాగే ప్రధానమంత్రిని ఐదు సార్లు సంప్రదించినా స్పందన రాలేదని, జంతర్‌మంతర్‌లో దీక్ష పెట్టినా బీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. “సోషల్ జస్టిస్ డే ద్వారా బీసీల ఆత్మగౌరవం పెంపొందిస్తాం,” అని సీఎం ధృవీకరించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ఐదుసార్లు ప్రధానికి లేఖ రాశా.. అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు
శాస్త్రీయ విధానం తప్పనిసరి: గంగుల కమలాకర్
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన గంగుల కమలాకర్ మాత్రం ఈ బిల్లుకు శాస్త్రీయ స్థిరత్వం లేదని అభిప్రాయపడ్డారు.
“మేము కూడా 42 శాతం రిజర్వేషన్లను సమర్థిస్తున్నాం. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో న్యాయస్థానంలో నిలబడదు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్, 1952 కింద మాత్రమే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. బిహార్, మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి బిల్లులు కొట్టివేయబడ్డాయి,” అని గంగుల హెచ్చరించారు.
“ప్రతి ఏడాది బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. 20 నెలలైంది కానీ 20 పైసలు కూడా రాలేదు. బీసీలను విస్మరించకూడదు,” అని ఆయన ఆరోపించారు.
పాలనలో రాజకీయ దృక్పథాల పోరు
సీఎం రేవంత్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించగా, గంగుల కమలాకర్ “మా సూచనలను విమర్శలుగా తీసుకోవద్దు” అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.
