Gangster Suicide: దేశ రాజధాని ఢిల్లీలోని మండోలి జైలులో ఓ ప్రముఖ గ్యాంగ్‌స్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పశ్చిమ ఢిల్లీలో పేరుగాంచిన గ్యాంగ్‌స్టర్ సల్మాన్ త్యాగి శనివారం అర్ధరాత్రి జైలు నంబర్ 15 వార్డులో బెడ్‌షీట్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే గార్డులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
కరడుగట్టిన నేర చరిత్ర
సల్మాన్ త్యాగిపై హత్య, దోపిడీ, ఆయుధాల కేసులు సహా అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయనపై MCOCA (మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నియంత్రణ చట్టం) కింద కూడా కేసు నమోదు కావడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఒకప్పుడు నీరజ్ బవానా గ్యాంగ్‌లో పనిచేసిన త్యాగి, తరువాత లారెన్స్ బిష్ణోయ్‌తో అనుబంధం పెంచుకున్నాడని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
గతేడాది జైలులో ఉండగానే త్యాగి తన గ్యాంగ్ సభ్యులకు ఆదేశాలు ఇచ్చి, పశ్చిమ ఢిల్లీలోని ఇద్దరు వ్యాపారవేత్తలను కాల్చి చంపే ప్రయత్నం చేయించాడు. ఈ ఘటన తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీపాంషు, మొయినుద్దీన్ అనే ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: స్వర్ణోత్సవ సూపర్ స్టార్ శ్రీ రజినీకాంత్ గారికి శుభాకాంక్షలు
జైలు భద్రతపై మళ్లీ ప్రశ్నలు
ఈ ఘటనతో మరోసారి ఢిల్లీ జైళ్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసుతో మండోలి జైలు వివాదాస్పదంగా మారింది. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్లు, పునరావృత నేరస్థులు ఎక్కువగా ఉండే ఈ జైలు, భద్రతా లోపాలు, అక్రమ ఫోన్ వాడకం, లంచాల వ్యవహారాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.
దర్యాప్తు కొనసాగుతోంది
త్యాగి ఆత్మహత్య వెనుక నిజమైన కారణాలు ఏవన్నా దాగి ఉన్నాయా? లేక నిజంగానే ఆయన మానసిక ఒత్తిడితో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు.
సల్మాన్ త్యాగి మరణం ఢిల్లీ జైళ్లలోని భద్రతా ప్రమాణాలు, ఖైదీల మానసిక ఆరోగ్య పరిస్థితులపై పెద్ద చర్చకు దారితీసింది.