Gaddar Film Awards: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం శనివారం (జూన్ 14) సాయంత్రం 6 గంటలకు హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. 14 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ తరహా అవార్డు వేడుక జరుగుతున్నందున సినీ పరిశ్రమలో ఉత్సాహం నెలకొంది.
2014 నుంచి 2023 వరకు ఉత్తమ సినిమాలకు గద్దర్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అలాగే 2024 సంవత్సరానికి వివిధ విభాగాల్లో ఉత్తమ నటన, దర్శకత్వం, సంగీతం, సాంకేతికత తదితరాల ఆధారంగా అవార్డులు ఇవ్వనున్నారు.
ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. అవార్డులు అందుకునే వారిలో ప్రముఖ నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి ముందుగానే అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Kannappa: కన్నప్ప సినిమాపై మరో వివాదం – బ్రాహ్మణ చైతన్య వేదిక ఆగ్రహం
సర్వసిద్ధంగా హైటెక్స్ వేదిక
ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు శుక్రవారం సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వేడుక సందర్భంగా ట్రాఫిక్, పార్కింగ్, భద్రత వంటి అంశాల్లో విభాగాల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
చలనచిత్ర రంగానికి గౌరవ సూచకంగా గద్దర్ అవార్డులు
తెలంగాణ ప్రజాకవి గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికి సినీ రంగం అభినందనలు తెలియజేస్తోంది. సినీ కళను, నైపుణ్యాన్ని గౌరవించే ఈ ప్రయత్నం కొత్త తరానికి ప్రోత్సాహాన్నిస్తుంది.