Gaaja: గాజా పట్టణం మరోసారి భయాందోళనతో కకావికలమైంది. శనివారం అర్థరాత్రి సమయంలో ఇజ్రాయెల్ సైన్యం పలు ప్రాంతాలపై విరుచుకుపడి ఉగ్రవైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో నివాస గృహాలు, శరణార్థి శిబిరాలు లక్ష్యంగా మారినందున, తీవ్ర ప్రాణనష్టం జరిగింది. మొత్తం 66 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వారి ప్రకారం, ఖాన్ యూనిస్‌లో 20 మంది, ఉత్తర గాజాలో 36 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 10 మంది మరణించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఉండటం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. దాడుల్లో గాయపడిన వందల మంది బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదే రోజు మొత్తం 150 మంది పాలస్తీనియన్లు మృతిచెందగా, 450 మంది గాయపడ్డారు. మార్చి 18న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించబడినప్పటి నుండి ఇప్పటివరకు 3,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. “కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు హమాస్ నిరాకరించిందనే కారణంతో ఈ దాడులను తీవ్రతరం చేయాల్సి వచ్చింది” అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తాజా దాడులపై ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.