complete alcohol prohibition:ఊరూరా లెక్కలేనన్ని బెల్ట్ షాపులు.. విచ్చలవిడి మద్యం అమ్మకాలు.. ఫలితంగా అనారోగ్యాలు, వివాదాలు, విభేదాలు, ఘర్షణలు.. రోడ్డున పడుతున్న కుటుంబాలు.. దీంతో మళ్లీ పల్లెల్లో గాంధీజీ స్ఫూర్తి రగిలింది. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు దిశగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు గ్రామాలు కదులుతున్నాయి. ఆ కోవలో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం గట్టికల్ గ్రామం చేరింది. విజయదశమి పర్వదినాన ప్రతిన బూనాలని నిర్ణయించుకున్నారు. మరునాటి నుంచి కట్టుదిట్టంగా నిషేధాన్ని అమలు చేయాలని నిశ్చయించుకున్నారు.
complete alcohol prohibition:గట్టికల్ గ్రామంలో ఎందరో మద్యం దురలవాటుతో అనారోగ్యాల బారిన పడి మృతిచెందారు. మరెందరో దీర్ఘకాల జబ్చులకు లోనయ్యారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో యువత చిత్తవుతుందని భావించిన గ్రామస్థులు అఖిలపక్షంగా ఏర్పడ్డారు. గాంధీ జయంతి నాడు సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానించుకున్నారు. దసరా మరునాటి నుంచి మద్యం అమ్మినా, ఎవరు కొనుగోలు చేసినా తగిన జరిమానా విధించాలని తీర్మానం చేశారు. మద్యం పట్టించిన వారికి బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు. అదే విధంగా గ్రామంలో కల్తీ కల్లు తయారు చేసినా తగు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.
complete alcohol prohibition:గట్టికల్ గ్రామ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఊరంతా ఒక్కటై గురు, శుక్రవారాల్లో అధికారులను కలిశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ ఊరి కట్టుబాటుకు సహకరించాలని కోరారు. వారిని అభినందించిన కలెక్టర్ సహకరిస్తానని అభయం ఇచ్చారు. ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ అధికారులను కలిసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు సహకరించాలని కోరారు. వారూ అందుకు సమ్మతించారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దని ఎక్సైజ్ అధికారులను, వైన్స్ యజమానులను గట్టికల్ గ్రామస్థులు కోరారు.
complete alcohol prohibition:దసరా తెల్లారి నుంచి గట్టికల్ గ్రామంలో ఎలాంటి మద్యాన్ని ఎవరూ అమ్మవద్దని చాటింపు వేయించారు. గ్రామస్థులెవరూ మద్యం తాగవద్దని, కొనవద్దని కోరారు. ఊరి మేలు కోసమే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు సహకరించాలని ఆ ఊరి యువత ఇల్లిల్లూ తిరుగుతూ గ్రామస్థుల్లో చైతన్యం తెస్తున్నారు. మహిళలు కూడా నడుం బిగించి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇలా ఊరంతా ఒక్కటై ఉన్నత లక్ష్యం కోసం చేస్తున్న ఈ స్ఫూర్తి మరిన్ని గ్రామాలకు విస్తరించాలని కోరుకుందాం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి