New Rules

New Rules: నవంబర్ 1 నుంచి: గ్యాస్ ధరల నుంచి బ్యాంక్ అకౌంట్ వరకు… కొత్త రూల్స్!

New Rules: నవంబర్ నెలలో ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల్లో పలు కీలక మార్పులు అమలులోకి రాబోతున్నాయి. వీటిలో క్రెడిట్ కార్డు ఛార్జీల నుంచి పెన్షనర్ల గడువు వరకు అనేక అంశాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1వ తేదీ నుంచే అమలవుతాయి.

బ్యాంకు ఖాతా, లాకర్ నామినేషన్లలో విప్లవాత్మక మార్పులు
బ్యాంక్ లాకర్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన నామినేషన్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ చట్టం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ఖాతాదారులకు వారి కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.

ఇప్పటివరకు ఖాతాదారులు ఒక ఖాతా లేదా లాకర్‌కు ఒక్కరిని మాత్రమే నామినీగా పేర్కొనే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై ఖాతాదారులు గరిష్టంగా నలుగురు వ్యక్తులను నామినీలుగా నియమించుకోవచ్చు. దీనివల్ల ఖాతాదారుడి మరణానంతరం డబ్బు లేదా వస్తువుల విషయంలో వారసత్వ గొడవలు, చట్టపరమైన చిక్కులు గణనీయంగా తగ్గుతాయి.

లాకర్‌ విషయంలో, నామినేషన్ సీరియల్ వారీగా అమలవుతుంది. అంటే, మొదటి నామినీ జీవించి లేనప్పుడే తదుపరి నామినీకి ఆ హక్కు బదిలీ అవుతుంది. అదే ఖాతాల విషయంలో, ప్రతి నామినీకి ఎంత శాతం ఆస్తి దక్కాలో ఖాతాదారుడు ముందే నిర్ణయించవచ్చు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు క్లెయిమ్ ప్రక్రియ సులభతరం అవుతుంది.

Also Read: Rajasthan Places: నవంబర్ లో రాజస్థాన్ లో..తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే..

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు నిబంధనలలో మార్పులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డు వినియోగదారులకు నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులు, వాలెట్ లోడింగ్ విషయంలో ఈ మార్పులు తీసుకొచ్చారు.

ఎడ్యుకేషన్ ఫీజులు: CRED, CheQ, లేదా Mobikwik వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా స్కూళ్లు లేదా కళాశాలల ఫీజులు చెల్లిస్తే ఇకపై బిల్లు మొత్తంలో 1 శాతం అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, విద్యా సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా పీఓఎస్‌ (POS) మెషీన్ల ద్వారా చెల్లింపులు చేస్తే ఈ ఛార్జీ వర్తించదు.

వాలెట్ లోడింగ్: క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా వాలెట్‌లో ₹1,000 కంటే ఎక్కువ మొత్తాన్ని లోడ్ చేస్తే, ఆ లావాదేవీపై 1 శాతం ఫీజు వసూలు చేస్తారు.

అన్‌సెక్యూర్డ్ కార్డులకు (Unsecured Cards) 3.75% ఛార్జీలు వర్తిస్తాయని ఎస్‌బీఐ ప్రకటించింది.

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ గడువు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు తాము జీవించి ఉన్నట్లు ధృవీకరిస్తూ లైఫ్ సర్టిఫికెట్‌ను (Life Certificate) సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం నవంబర్ 1 నుంచి 30 వరకు గడువు ఉంటుంది. కాగా, 80 ఏళ్లు దాటిన పెన్షనర్ల కోసం ఈ ప్రక్రియ ఇప్పటికే అక్టోబర్ 1 నుంచే మొదలైంది. ఏటా ఈ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గడువు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) నుంచి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ (UPS) కు మారడానికి ఇచ్చిన గడువు నవంబర్ 30 తో ముగుస్తుంది. వాస్తవానికి ఈ గడువు సెప్టెంబర్ 30 వరకే ఉన్నప్పటికీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని మరో రెండు నెలలు పొడిగించింది.

Also Read: Delhi: దూసుకుపోతున్న దూకుడు.. రూ. 143 లక్షల కోట్ల దాటిన డిజిటల్ చెల్లింపులు

ఎల్‌పీజీ, సీఎన్‌జీ ధరలలో మార్పు
ప్రతి నెల మాదిరిగానే నవంబర్ 1న ఎల్‌పీజీ (LPG), సీఎన్‌జీ (CNG), పీఎన్‌జీ (PNG) ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా చమురు కంపెనీలు ఈ ధరలను సవరిస్తాయి. గృహ వినియోగ సిలిండర్ ధరలో కొద్ది నెలలుగా మార్పు లేనప్పటికీ, వాణిజ్య సిలిండర్ ధరలో మాత్రం మార్పులు చోటుచేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు అడ్డుకట్ట
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి కొత్త నిబంధనను తీసుకువచ్చింది. AMC (ఆస్తి నిర్వహణ కంపెనీ) కి చెందిన అధికారులు, ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ₹15 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే, ఆ వివరాలను కంపెనీ కంప్లైయన్స్ ఆఫీసర్‌కు తప్పనిసరిగా నివేదించాలి. ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ను అరికట్టడమే ఈ కొత్త నిబంధన ప్రధాన లక్ష్యం.

ఆధార్ అప్‌డేట్ మరింత సులభం
యూఐడీఏఐ (UIDAI) తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ ద్వారా ఇకపై ఆధార్ కార్డు అప్‌డేట్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. వినియోగదారులు పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని నేరుగా ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఆ తర్వాత, ఆధార్ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ లేదా ఐరిస్ (కంటి) స్కాన్ పూర్తి చేస్తే సరిపోతుంది. పత్రాలను అప్‌లోడ్ చేయడంలో ఉన్న ఇబ్బందులు ఈ విధానంలో ఉండవు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *