PM Modi

PM Modi: సైకిల్‌పై రాకెట్ యుగం నుంచి ‘విక్రమ్-1’ ప్రైవేట్ శక్తి వరకు భారత ప్రస్థానం – మోదీ ప్రశంసలు

PM Modi: భారతదేశ అంతరిక్ష రంగంలో ఒక కొత్త శకం మొదలైంది. హైదరాబాద్‌లోని రావిర్యాల, శంషాబాద్ సమీపంలో ఏర్పాటైన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది మన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ కావడం విశేషం. ఇదే సందర్భంగా, భారతదేశపు తొలి ప్రైవేట్ వాణిజ్య (కమర్షియల్) రాకెట్ ‘విక్రమ్-1’ను కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ మైలురాయి విజయాన్ని పురస్కరించుకుని, ప్రధాని మోదీ స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపారు. ‘భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ఉదాహరణ’ అని ఆయన కొనియాడారు.

సైకిల్ నుంచి స్టార్టప్ దాకా..
‘సైకిల్ మీద రాకెట్‌ను మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రయాణం మొదలైంది. వనరులు తక్కువగా ఉన్నా, మన ఆశయాలు ఎప్పుడూ తగ్గలేదు’ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం, ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన లాంచ్ వెహికిల్ (ప్రయోగ వాహనం) మన భారతదేశం వద్ద ఉందని ఆయన గర్వంగా చెప్పారు.

Also Read: DK Shivakumar: కర్ణాటక సీఎం పీఠం పంచాయితీ: ‘మాట నిలబెట్టుకోవాలి’ అంటూ డీకే శివకుమార్ సంచలన పోస్ట్

ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం
కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే స్కైరూట్ వంటి స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయని, ప్రైవేట్ రంగంలోనూ అంతరిక్ష సంస్థలు వస్తున్నాయని ప్రధాని తెలిపారు. ‘జన్-జీ’ (యువతరం) అనుకున్నది సాధించేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ అవకాశాలను జెన్‌జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్స్‌, సైంటిస్టులు అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత స్పేస్ ఎకానమీ లక్ష్యం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భారత అంతరిక్ష రంగంలో జరిగిన ఘనతలను గుర్తుచేశారు. చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్-1 ప్రయోగాలు, ఒకేసారి 400 ఉపగ్రహాలను ప్రయోగించిన ఘనత ఇస్రోకే దక్కుతుందని కొనియాడారు.

‘ప్రస్తుతం భారత స్పేస్ ఎకానమీ ₹ 70,000 కోట్లు దాటింది. 2030 నాటికి ఇది ₹ 4 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది’ అని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రపంచ ఉపగ్రహ ప్రయోగాల్లో భారతదేశం అగ్రగామిగా ఎదుగుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ‘గగన్‌యాన్’ మిషన్‌తో పాటు, 2047లో చేపట్టబోయే మూన్ మిషన్‌కు అంతా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్కైరూట్ విజయం భారతీయ మేధస్సు, నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిందని, ఇది దేశంలోని యువతకు గొప్ప స్ఫూర్తినిస్తుందని కేంద్రమంత్రి అన్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *