Nayanthara: నటి నయనతారకు కొంత కాలంగా దెబ్బ మీద దెబ్బ ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా తన వెడ్డింగ్ డాక్యుమెంటరీకి మళ్ళీ చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈసారి ఆమె 2005లో నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘చంద్రముఖి’ క్లిప్‌లను అనుమతి లేకుండా ఉపయోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో డాక్యుమెంటరీని నిర్మించిన టార్క్ స్టూడియోస్‌ను తమ సమాధానం దాఖలు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
చంద్రముఖి వివాదం
‘నయనతార – బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీని టార్క్ స్టూడియోస్ నిర్మించింది. ఇది నవంబర్ 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాలోని కొన్ని భాగాలను ఉపయోగించారని, దీనికి అనుమతి తీసుకోలేదని ఆ సినిమా కాపీరైట్ హక్కులు ఉన్న ఏబీ ఇంటర్నేషనల్ అనే సంస్థ కోర్టులో కేసు వేసింది. ఈ క్లిప్‌లను వెంటనే తొలగించాలని, రూ. 5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాము లీగల్ నోటీసు పంపినా పట్టించుకోలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
దీనిపై కోర్టు టార్క్ స్టూడియోస్‌కు నోటీసులు ఇచ్చింది. వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయని టార్క్ స్టూడియోస్ తరపు న్యాయవాది చెప్పగా, పిటిషనర్ న్యాయవాది ఆ వాదనను ఖండించారు. దీంతో, కోర్టు టార్క్ స్టూడియోస్‌కు అక్టోబర్ 6వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
గతంలో కూడా ఇలాంటి వివాదమే..
ఇదే డాక్యుమెంటరీకి సంబంధించి గతంలో కూడా వివాదం తలెత్తింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా క్లిప్‌లను అనధికారికంగా వాడారని ఆ సినిమా నిర్మాత, నటుడు ధనుష్ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్ కేసు వేసింది. ఆ సమయంలో ధనుష్‌పై నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. ఈ వివాదం ఇంకా కోర్టులో ఉంది.