Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత వల్లభనేని వంశీ మోహన్‌పై విజయవాడలో తాజాగా మరో పోలీస్ కేసు నమోదైంది. గత ఏడాది కాలంగా వరుస వివాదాలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్న ఆయనకు, ఈ కొత్త కేసు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. 2024 జూలై నెలలో వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని, తనను తీవ్రంగా బెదిరించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వంశీతో పాటు మరో ఎనిమిది మంది అనుచరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిజానికి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో సత్యవర్థన్ అనే దళిత యువకుడు ప్రధాన సాక్షిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ బృందం సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారనే ఆరోపణలపై ఇప్పటికే ఆయన జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజా ఫిర్యాదులో కూడా గతంలో జరిగిన దాడుల ప్రస్తావన ఉండటంతో పోలీసులు దీనిని లోతుగా విచారిస్తున్నారు.
వంశీపై కేవలం ఈ దాడి కేసులే కాకుండా ఆర్థిక, పరిపాలనాపరమైన ఆరోపణలు కూడా అనేకం ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గ పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారం, బాపులపాడు మండలంలో చోటుచేసుకున్న నకిలీ ఇళ్ల పట్టాల కుంభకోణంపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఆయనపై నిఘా ఉంచాయి. ఒక్కొక్కటిగా పాత కేసులు వెలుగులోకి వస్తుండటంతో వంశీపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం మాచవరం పోలీసులు ఈ తాజా కేసులో ఎనిమిది మంది నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. వరుసగా కేసులు నమోదవుతుండటంతో గన్నవరం రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
