Sri Lanka: శ్రీలంక ప్రభుత్వం తమ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏడు దేశాలకు ఉచిత వీసా సదుపాయం అందిస్తుండగా, తాజాగా మరో 40 దేశాలకు ఉచిత టూరిస్టు వీసా విధానాన్ని విస్తరించింది. ఈ నిర్ణయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరత్ ప్రకటించారు.
గత వారం కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఈ విస్తరణ జరిగింది. ఇప్పటికే చైనా, ఇండియా, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్, మలేషియా, మరియు జపాన్ దేశాల పౌరులకు మార్చి 2023 నుంచే ఉచిత వీసా సదుపాయం అమల్లో ఉంది. ఇప్పుడు దీనికి అదనంగా మరో 40 దేశాలను చేర్చారు.
ఇది కూడా చదవండి: Niharika Konidela: ఆ నొప్పి నాకు మాత్రమే తెలుసు.. విడాకులపై స్పందించిన నిహారిక
కొత్తగా ఈ జాబితాలో చేరిన దేశాలలో యునైటెడ్ కింగ్‌డమ్ (UK), యునైటెడ్ స్టేట్స్ (US), కెనడా, పాకిస్తాన్, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, బెల్జియం, పోలాండ్, కజకిస్తాన్, సౌదీ అరేబియా, నేపాల్, న్యూజిలాండ్, సౌత్ కొరియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, బెలారస్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, టర్కీ వంటివి ఉన్నాయి.
ఈ నిర్ణయం వల్ల వీసా ఫీజుల రూపంలో సుమారు 66 మిలియన్ డాలర్ల ఆదాయం తగ్గినప్పటికీ, పర్యాటకుల రాక పెరగడం ద్వారా పరోక్షంగా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఈ నష్టాన్ని అధిగమిస్తాయని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక సంక్షోభం నుండి కోలుకుంటున్న శ్రీలంకకు పర్యాటక రంగం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఈ చర్య పర్యాటకులను మరింతగా ఆకర్షించి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని ఆశిస్తున్నారు.