AP Free Bus: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ముఖ్యమైన సంక్షేమ పథకం త్వరలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీగా చెప్పిన “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం” ఆగస్టు 15 నుంచి అమలులోకి రానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎలాంటి టిక్కెట్ ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు.
తాజాగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం వివరాలు వెల్లడించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాదిరిగానే మన రాష్ట్రంలోనూ ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తామని చెప్పారు.
ఈ పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుందని మంత్రి తెలిపారు. ఇప్పటికే పలు బస్సులకు మరమ్మతులు పూర్తి చేశామని, కొత్తగా 1200 బస్సులను కూడా కొనుగోలు చేశామని వెల్లడించారు.
ఈ పథకం అమలులో పారదర్శకత ఉండేందుకు “జీరో ఫేర్ టిక్కెట్” విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళలు ఎక్కడినుంచి ఎక్కడికి ప్రయాణించారు, టిక్కెట్ ధర ఎంత, ప్రభుత్వం ఎంత భారం భరిస్తోంది అనే సమాచారం టిక్కెట్‌పై ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, సాంకేతిక ఏర్పాట్ల కోసం సంబంధిత శాఖలను ఆదేశించిన సీఎం చంద్రబాబు.. మహిళల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం రాష్ట్ర అభివృద్ధిలో ఓ ముందడుగు అవుతుందని నమ్మకంగా ఉన్నారు.
ఇపుడు దేశంలో ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. దీనివల్ల ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, విద్యార్థినులు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే వారు పెద్ద మొత్తంలో లబ్దిపొందనున్నారు.

