Delhi Blast Case: ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన పేలుడు కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, తాజాగా మరో నలుగురు నిందితులను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని శ్రీనగర్‌లో పట్టుకున్నట్లు సమాచారం.
ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేసిన ఈ నలుగురిని, ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు డాక్టర్లు ఉండడం గమనార్హం. వీరి వివరాలు: పుల్వామాకు చెందిన డా. ముజమ్మిల్ షకీల్, అనంతనాగ్‌కు చెందిన డా. అదీల్, లక్నోకు చెందిన డా. షహీన్, మరియు ఇర్ఫాన్.
ఈ కేసులో అసలు లక్ష్యం ఎర్రకోట వద్ద జరిగిన కారు బ్లాస్ట్ అని అధికారులు తెలిపారు. ఈ తాజా అరెస్టులతో కలిపి, ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు నిందితులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నట్లయింది. ఈ పేలుడు వెనుక ఉన్న పూర్తి కుట్రను ఛేదించడానికి దర్యాప్తు సంస్థ మరింత లోతుగా విచారణ జరుపుతోంది.

