Simhachalam Tragedy: విశాఖపట్నం జిల్లా సింహాచలం అటవీప్రాంతంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులపై దురదృష్టం ముసురుకుంది. మంగళవారం తెల్లవారుజామున, భారీ వర్షాల కారణంగా గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
మృతులు మధురవాడ సమీపంలోని చంద్రంపాలెంకు చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26), శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జూరి మహాలక్ష్మిలుగా గుర్తించారు. ఉమామహేశ్వరరావు, శైలజ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఇటీవలే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. స్వామివారి నిజరూప దర్శనానికి ప్రత్యేక క్యూలైన్‌లో నిలబడిన సమయంలో గోడ ఒక్కసారిగా కూలి కులడంతో వారికి మృత్యువు చేరుకుంది.
ఇది కూడా చదవండి: PM Modi: సింహాచలం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఈ విషాదకర సంఘటన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కేజీహెచ్ ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. “మూడేళ్ల క్రితం పెద్దలు కట్టి పెళ్లి చేసి, ఇద్దరూ స్థిరపడుతున్నారు అనుకుంటే, ఇలా ఒక్కసారిగా అంతమైపోతారనే అనుకోలేం” అని శైలజ సోదరుడు వాపోయాడు. చుట్టుపక్కల ప్రజలు, బంధుమిత్రులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
సంఘటన జరిగిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ ఘటన మరలే ఒకసారి భక్తుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గోడల స్థితిగతులు, క్యూలైన్ నిర్మాణం మరియు భద్రతా ఏర్పాట్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.