Sri Lanka: కొలంబోలో ఈరోజు శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను సిఐడి (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్) అధికారులు అరెస్టు చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రభుత్వ నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారన్న ఆరోపణలు ఈ అరెస్టుకు దారితీశాయి.
ఆరోపణల నేపథ్యం
విక్రమసింఘే తన భార్య మైత్రీ విక్రమసింఘే లండన్‌లోని వోల్వర్‌హాంప్టన్ విశ్వవిద్యాలయం పిహెచ్‌డీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రభుత్వ నిధులను వినియోగించారని సిఐడి నివేదిక పేర్కొంది.
-
2023 సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమం జరిగింది.
-
ఆయనతో పాటు పది మంది సభ్యుల బృందం కూడా లండన్ వెళ్లింది.
-
ఈ పర్యటనకు ప్రభుత్వానికి సుమారు రూ. 16.9 మిలియన్లు ఖర్చైనట్లు విచారణలో తేలింది.
అధికారిక విదేశీ పర్యటనలో భాగంగా అమెరికా నుండి యుకెకు వెళ్లినప్పటికీ, అది వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిగిందని దర్యాప్తు అధికారులు స్పష్టంచేశారు.
మాజీ సహచరులపై విచారణ
ఇప్పటికే విక్రమసింఘే మాజీ అధ్యక్ష కార్యదర్శి సమన ఏకనాయకే, ప్రైవేట్ కార్యదర్శి సాండ్రా పెరెరాలను కూడా ప్రశ్నించారు.
విక్రమసింఘే స్పందన
మాజీ అధ్యక్షుడు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
-
వోల్వర్‌హాంప్టన్ విశ్వవిద్యాలయ సందర్శనపై వచ్చిన వార్తలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని ఆయన కార్యాలయం ప్రకటించింది.
-
చట్టపరమైన సంప్రదింపుల తర్వాత అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.
వివాదాస్పద రాజకీయ జీవితం
1980లు–1990ల్లో బటలండ హింసా సంఘటనల్లో విక్రమసింఘే పాత్ర ఉందన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయ. 1995లో అధ్యక్ష విచారణ కమిషన్ ఆయన పౌర హక్కులను రద్దు చేయాలని సిఫార్సు చేసినా, ఆ నిర్ణయం అమల్లోకి రాలేదు.
1977లో పార్లమెంటులోకి ప్రవేశించిన విక్రమసింఘే, అనేకసార్లు ప్రధానమంత్రిగా పనిచేసి, గోటబయ రాజపక్స రాజీనామా తర్వాత అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022 నుంచి 2024 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన, ఇటీవల సంవత్సరాల్లో అరెస్టయిన అత్యంత సీనియర్ నేతగా నిలిచారు.
రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు
విక్రమసింఘే అరెస్టు శ్రీలంక రాజకీయ వ్యవస్థను కుదిపేసింది. అవినీతి, ప్రజా వనరుల దుర్వినియోగం, బాధ్యతారాహిత్యం వంటి ఆరోపణలు శ్రీలంక రాజకీయాల్లో కొత్తవి కావు. అయితే, దేశంలో అత్యున్నత పదవిని చేపట్టిన నాయకుడు ఈ విధంగా అరెస్టు కావడం చారిత్రాత్మకంగా భావిస్తున్నారు.
తదుపరి పరిణామాలు
దర్యాప్తు కొనసాగుతున్నందున, విక్రమసింఘేను త్వరలోనే కొలంబో కోర్టు ఎదుట హాజరుపరచే అవకాశం ఉంది.