Sabarimala: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారు తాపడం మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఆలయ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) సుధీష్ కుమార్ను అరెస్టు చేసింది. సుధీష్ కుమార్ 2019లో శబరిమల ఆలయ ఈఓగా పనిచేశారు. ఆ సమయంలో గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలకు ఉన్న బంగారు తాపడాలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఆలయ అధికారిక పత్రాలలో రాగి పలకలుగా నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. 1998-99లోనే ఈ విగ్రహాలకు బంగారు తాపడం చేసిన విషయం సుధీష్ కుమార్‌కు తెలుసు.
అయినప్పటికీ, ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి మరమ్మతుల కోసం ఈ పలకలను అప్పగించే సమయంలో వాటిని రాగి పలకలుగా పేర్కొనడం వల్ల, పొట్టి వాటిపై ఉన్న బంగారాన్ని తొలగించడానికి మరియు దొంగిలించడానికి మార్గం సుగమమైందని సిట్ అనుమానిస్తోంది. తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో సుధీష్ కుమార్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం శనివారం (నవంబర్ 1, 2025) సిట్ ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇది మూడో అరెస్ట్. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బీ మురారీ బాబులను ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది.
అరెస్ట్ అనంతరం సుధీష్ కుమార్‌ను జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. శబరిమలలోని శ్రీకోవిల్ ద్వారపాలక విగ్రహాలు, గడపకు సంబంధించిన బంగారు తాపడంలో సుమారు 4.5 కిలోల బంగారం మాయమైనట్లు కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించి, సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

