Telangana: నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్య సహా ఎక్కడికక్కడ పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పాదయాత్ర నేపథ్యంలో చిరుమర్తిని నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామం వద్ద మూసీ పరీవాహక ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్రకు వస్తుండటంతో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
గతంలో సీఎం పర్యటనను అడ్డుకుంటామని చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. రైతుబంధు ఇవ్వలేదని, రుణమాఫీ పూర్తి చేయలేదని, వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఇతర హామీలను అమలు చేయడం లేదంటూ మూసీ పరీవాహక గ్రామాల్లో బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మా వూరికి వస్తే హామీలు అమలు చేయాలి.. అని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: KTR: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం
Telangana: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోలీసులను ఎంతగా వారిస్తున్నా బలవంతంగా లాక్కెళ్లి జీపులో పడవేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. వారిని తొలగించి చిరుమర్తిని లాక్కెళ్లారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా.. కనీసం తన అభిప్రాయం కూడా తీసుకోరా? అంటూ మండిపడ్డారు.
అదే విధంగా వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు, చిట్యాల మండలాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్, ఇతర ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. యాదగిరిగుట్ట, వలిగొండ మండలాల్లో వందలాది సంఖ్యలో పోలీసులు బందోబస్తుతో పహారా కాస్తున్నారు.
Telangana: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పాదయాత్రపై ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. పోలీస్ పహారా, నిర్బంధాల నడుమ సీఎం రేవంత్‌రెడ్డి బిక్కుబిక్కుమంటూ పాదయాత్ర చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజావ్యతిరేకత ఏమిటో ఇప్పుడు బోధపడుతుందా? అని ప్రశ్నించారు.