Jogi Ramesh: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ నకిలీ మద్యం అంశంపై మరోసారి తీవ్రంగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు, వీడియో చాట్ వ్యవహారంపై ఆయన కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును, లోకేష్‌ను టార్గెట్ చేస్తూ సవాళ్లు విసిరారు.
‘నా ఫోన్ నుంచి చాట్ చేశామని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం’
నిన్న తన పేరుతో ఒక వీడియో చాట్ చేశారని విడుదల చేసి, దానిపై చర్చా వేదికలు నడిపారని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోన్ నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా జనార్ధన్ రావుతో చాట్ చేశామని నిరూపిస్తే… “ఏ శిక్షకైనా సిద్ధమని” ఆయన సవాల్ విసిరారు.
“నేను లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు, లోకేష్ సిద్ధమా?” అని ప్రశ్నించారు. అంతేకాదు, తన భార్యాబిడ్డలను తీసుకుని తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ప్రమాణం చేసి చెబుతానన్నారు. “చంద్రబాబు, లోకేష్ మీ కుటుంబ సభ్యులతో వచ్చి నేను తప్పు చేశానని చెప్తారా?” అని నిలదీశారు. తిరుమలకు రాలేకపోతే కనకదుర్గమ్మ గుడి దగ్గరకైనా వస్తా అని, లేదా తానే చంద్రబాబు ఇంటికి వస్తా అని… “మీ ఇంట్లోనే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పే ధైర్యం మీకు ఉందా?” అని జోగి రమేశ్ మండిపడ్డారు.
Also Read: Chandrababu Naidu: ఏపీలో ప్రధాని మోడీ పర్యటన.. సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
‘ఒక బలహీన వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు’
కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగా దిగజారిపోయారో ఈ ఘటనతో అర్థమవుతోందని జోగి రమేశ్ తీవ్రంగా విమర్శించారు. ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని అణగదొక్కాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. “మీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారాలా?” అని ప్రశ్నించారు.
ఇబ్రహీంపట్నంలో ఏఏ ఫ్యాక్టరీ గురించి తానే చూపించి బయటపెడితే, తిరిగి తన మీదే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. “నారా వారి సారాను ఏరులై పారిస్తున్నారు” అని ఆరోపిస్తూ, ఇందులో పవన్‌ను, బీజేపీని కలుపుకోరని అన్నారు. “ఆఫ్రికా నుంచి జనార్ధన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా నా పేరు ఉందా?” అని ఆయన నిలదీశారు.
‘ముఖ్యమంత్రి తన స్థాయిని తగ్గించుకుంటున్నారు’
“ఒక పక్క ఫోన్ పోయింది అంటారు, మరోపక్క అదే చొక్కాతో తీసిన వీడియో రిలీజ్ చేస్తారు” అంటూ మాజీ మంత్రి రమేశ్ విమర్శించారు. ముఖ్యమంత్రి తన స్థాయిని తగ్గించుకుని ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై కుట్రలు పన్నినా పైన దేవుడు ఉన్నాడని రమేష్ అన్నారు. “చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తాడు. జోగి రమేష్ ఎలాంటి వాడో మా వాళ్లందరికీ తెలుసు” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.