Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత జూన్ నెలలో నూతక్కి సునీల్ అనే వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసులో వంశీని ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొంటూ విజయవాడ మాచవరం పోలీసులు కేసు నమోదు చేయడమే దీనికి ప్రధాన కారణం. ఈ కేసులో అరెస్టు తప్పదని భావించిన వంశీ, గత కొన్ని రోజులుగా తన ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు.
వంశీ తన అనుచరులను రెచ్చగొట్టి మారణాయుధాలతో సునీల్‌పై దాడి చేయించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, న్యాయస్థానం నుంచి ఎలాంటి ఊరట లభించలేదు. దీనికి తోడు, సోమవారం విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో జరగాల్సిన ఒక పాత కేసు విచారణకు కూడా వంశీ హాజరుకాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలను మరింత తీవ్రతరం చేశారు.
Also Read: iBomma Ravi: ఐబొమ్మ రవి గుట్టురట్టు.. కోట్లలో లావాదేవీలు.. కస్టడీ రిపోర్ట్‌లో సంచలన నిజాలు!
ప్రస్తుతం వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరుల కోసం మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బృందాలు హైదరాబాద్ చేరుకుని ఆయన ఆచూకీ కోసం గాలింపు జరుపుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వంశీపై ఇప్పటికే 13 కేసులు నమోదు కాగా, గతంలో ఆయన 140 రోజుల పాటు జైలులో ఉండి ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా మరో కేసులో ఆయన పేరు తెరపైకి రావడంతో పోలీసులు ఏ క్షణమైనా ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
