Food Poisoning: రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, కొమురంభీం జిల్లాలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగులోకి వచ్చింది.
కొమురంభీం జిల్లాలో ఫుడ్ పాయిజన్: ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత
కొమురంభీం జిల్లాలోని రెబ్బెన గురుకుల పాఠశాలలో ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి భోజనం తిన్న తర్వాత ముగ్గురు పదో తరగతి విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడిన విద్యార్థులను వెంటనే బెల్లంపల్లిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
‘ఎన్ని ఘటనలు జరిగినా మారని ప్రభుత్వ తీరు’
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో కూడా పలు గురుకులాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ ఘటనల తర్వాత ప్రభుత్వం విచారణకు ఆదేశించడం, చర్యలు తీసుకుంటామని చెప్పడం సర్వసాధారణంగా మారింది. అయితే, ఆచరణలో మాత్రం పరిస్థితి మారడం లేదని, అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని విపక్షాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.