Floods: మొంథా తుఫాన్ కారణంగా తెలంగాణ రాష్ట్రం వర్షాల ముంపులో కూరుకుపోయింది. బుధవారం ఉదయం నుండి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగిపొర్లుతుండటంతో రోడ్ల రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గ్రామాలు, పట్టణాలు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి మరింత విషమంగా మారింది. అక్కడ రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు చేరడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై నీరు ప్రవహించడంతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ఇక, దక్షిణ మధ్య రైల్వే అధికారులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లను రద్దు చేశారు. మొత్తం 127 రైళ్లు తాత్కాలికంగా రద్దు కాగా, 14 రైళ్లను దారి మళ్లించారు. ఫలక్‌నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ రైళ్లు రద్దు చేసిన వాటిలో ఉన్నాయి.
Also Read: Heavy Rain Alert: తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్ నగరంలో కూడా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం పెరగడంతో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.
అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం కాకపోతే ఇళ్ల బయటకు రాకూడదని హెచ్చరించారు. సింగరేణి ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేయబడింది. వర్షాలు కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతులు దెబ్బతినగా, ప్రభుత్వం అత్యవసర విభాగాలను అప్రమత్తం చేసింది. రానున్న గంటల్లో వర్షాలు ఇంకా కొనసాగనున్నాయని అంచనా.

