ఖాట్మండు: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నేపాల్‌లో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో 50 మంది మరణించినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఆకస్మిక వర్షాలతో నేపాల్‌లోని పలు ప్రాంతాలు మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలతో ఖాట్మండు జిల్లాలో 11 మంది, లలిత్‌పూర్‌లో 16 మంది, భక్తపూర్‌లో 5 మంది, కవ్రేలో 6 మంది, సింధుపాల్‌చోక్‌లో 2 మంది, పంచతార్‌లో 5 మంది, ధన్‌కూటలో 2 మంది, సింధులి, ఝాపా, ధాడింగ్‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు ఖాట్మండు ప్రభుత్వం తెలిపింది. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిశ్వో అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఖాట్మండు లోయలోని మూడు జిల్లాల్లోనే 32 మంది మరణించగా.. 12 మంది తప్పిపోయారు.
లోయలో వరదల కారణంగా నాలుగు కాంక్రీట్ ఇళ్లు ధ్వంసమయ్యాయని, 1,244 ఇళ్లు నీటమునిగిపోయాయని ఓ అధికారి తెలిపారు. దేశవ్యాప్తంగా 44 జిల్లాలు వరదలు బీభత్సం సృష్టించాయని, కొండచరియలు విరిగిపడ్డాయని పోలీసులు తెలిపారు. దీంతో 39 జిల్లాల్లో రోడ్లు పూర్తిగా మూసివేశారు. రహదారులపై కొండచరియలు తొలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రెస్క్యూ సిబ్బందితోపాటు ఖాట్మండు జిల్లా పోలీస్ రేంజ్ నుండి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బసంత రాజౌరే ఆధ్వర్యంలో 3,060 మంది పోలీసు సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.