Flipkart: భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన సామ్రాజ్యాన్ని పెంచే దిశగా అడుగు వేస్తోంది. ఇప్పటికే ‘మినిట్స్’ (Minutes) పేరుతో క్విక్ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ఈ వాల్‌మార్ట్ యాజమాన్య సంస్థ, ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ (Food Delivery) మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ విభాగంలోకి ఫ్లిప్‌కార్ట్ రాకతో పోటీ మరింత పెరగనుంది. ఈ ఏడాది మే-జూన్ నెలల్లో బెంగళూరు వేదికగా ఫ్లిప్‌కార్ట్ తన ఫుడ్ డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా (Pilot) ప్రారంభించనుంది.
ఏమిటి? ఎవరు? ఎక్కడ?
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్, భారతదేశంలోని సుమారు 9 బిలియన్ డాలర్ల విలువైన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకోసం ఇప్పటికే ఒక ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ప్రారంభంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టి, ఆ తర్వాత 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఫ్లిప్‌కార్ట్ వ్యూహం – ONDC తో భాగస్వామ్యం?
ఫ్లిప్‌కార్ట్ తన ఫుడ్ డెలివరీ సేవలను ఏ విధంగా అందించాలనే దానిపై రెండు ఆప్షన్లను పరిశీలిస్తోంది.. తన యాప్‌లోనే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి అందులోంచే ఆర్డర్స్ తీసుకోవాలా లేక ప్రభుత్వ మద్దతు ఉన్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ప్లాట్‌ఫారమ్ ద్వారా రెస్టారెంట్లను అనుసంధానించడం. గతంలో కూడా ఫ్లిప్‌కార్ట్ ఆహార విభాగంలోకి రావాలని ప్రయత్నించినప్పటికీ, ఈసారి మరింత పక్కా ప్రణాళికతో, తన వద్ద ఉన్న భారీ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను వాడుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఉన్న ‘క్విక్ కామర్స్’ డార్క్ స్టోర్లను ఫుడ్ డెలివరీకి కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
మార్కెట్ ప్రభావం – ఐపీఓ లక్ష్యం
ప్రస్తుతం భారత ఫుడ్ డెలివరీ మార్కెట్లో జొమాటో (Zomato) – స్విగ్గీ (Swiggy) అగ్రస్థానంలో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ వార్తలతో ఈ రెండు కంపెనీల షేర్ల ధరలు కూడా స్వల్పంగా ప్రభావితమయ్యాయి.
పెరుగుతున్న డిమాండ్: 2030 నాటికి భారత ఫుడ్ డెలివరీ మార్కెట్ 25 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
ఐపీఓ సన్నాహాలు: 2026లో ఐపీఓ (IPO) కి వెళ్లాలని భావిస్తున్న ఫ్లిప్‌కార్ట్, తన రెవెన్యూ మోడల్‌ను మరింత బలోపేతం చేయడానికి ఈ కొత్త విభాగం తోడ్పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
