AP News: అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, కేంద్ర పాలిత ప్రాంతం యానాం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ (ఆకస్మిక వరద) ముప్పు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించగా, స్థానిక అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది.
అల్పపీడనం బలపడే అవకాశం
విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, పశ్చిమ మధ్య – వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి లోతైన అల్పపీడనంగా మారే అవకాశముంది. ఇది ఉత్తరాంధ్ర – ఒడిశా వైపు కదిలే అవకాశం ఉండటంతో, రాబోయే వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షపాతం వివరాలు
గడచిన 24 గంటల్లో ఏలూరులో 22 సెంటీమీటర్లు, ముమ్మిడివరంలో 18 సెంటీమీటర్లు, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల వద్ద ప్రమాద సూచికలు ఎగురవేశారు. గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇది కూడా చదవండి: AP High Court: హైకోర్టులో వైసీపీకి మరోసారి ఎదురుదెబ్బ
కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు హెచ్చరిక
భారీ వర్షాల కారణంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. నదిలో పడవల ప్రయాణం, చేపల వేట, ఈత వంటి కార్యక్రమాలు చేయవద్దని సూచించారు. ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
అధికారుల అప్రమత్తం
వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉండగా, అవసరమైతే తక్షణమే తరలింపు చర్యలు చేపట్టేలా విపత్తు నిర్వహణ శాఖ సన్నద్ధమైంది. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది.