pushpa 2

Pushpa 2: మాస్ సినిమాలో కొత్త కోణం.. పుష్ప-2 ఎందుకు చూడాలంటే..

Pushpa 2: అల్లు అర్జున్ – సుకుమార్ మూడేళ్ళుగా ఒకటే మాట చెబుతూ వచ్చారు. మాస్ సినిమాల్లో కొత్త కోణంతో సినిమా పుష్ప 2 అని. ఇటీవల ప్రమోషన్స్ సమయంలోనూ.. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ కూడా ఇదే మాట గట్టిగా చెప్పారు. ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకులకు ఆ మాటలు కరెక్ట్ అనిపిస్తున్నాయి. మాస్ సినిమాల్లో కొత్త కోణం అంటే ఏముంటుంది అని అనుకున్నవారికి పుష్ప 2 సరైన సమాధానం ఇచ్చింది. మాస్ అనగానే ఒక్క హీరో వందల మందిని నరుక్కుంటూ పోవడం మన సినిమాల్లో కామన్. పుష్ప 2లో కూడా అది చాలా ఎక్కువగానే ఉంది. దాదాపుగా సినిమాలో 70 శాతం ఊచకోతలే కనిపించాయి. కానీ.. ఇలాంటి ఊచకోతల్లో కూడా హృదయానికి హత్తుకునే సన్నివేశాలు రాసుకున్నారు సుకుమార్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. కాదు ఫైర్ నుంచి వైల్డ్ ఫైర్ వైపు వెళ్లినా తెరమీద కనిపించే వైల్డ్ ని గుండెని తడిచేసే సీన్స్ తో బ్యాలెన్స్ చేశారు సుకుమార్. ఇది అంత ఈజీకాదు. అసలు పుష్ప 2 సినిమాని ఎందుకు చూడాలి అంటే.. ఒక ఐదు రీజన్స్ గట్టిగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి అని చెప్పలేము కానీ, ఇటీవల వచ్చిన యానిమల్ లాంటి వైల్డ్ కల్ట్ సినిమాతో పోల్చుకుంటే మంచి సినిమాగా పుష్పను నిలబెట్టే రీజన్స్ అవి. సుకుమార్ సృష్టించిన కొన్ని సీన్స్ కి అల్లు అర్జున్ నటన మరింత ఎలివేషన్ ఇచ్చింది. అసలు ఆ ఐదు రీజన్ ఏమిటో చెప్పుకుందాం..

Pushpa 2: మొదటి నుంచి చివరి వరకూ అల్లు అర్జున్ తో పలికించిన డైలాగులు. మాస్ హీరో సినిమా అనగానే కచ్చితంగా బీప్ సౌండ్ పడే డైలాగుల వరద ఇటీవల సినిమాల్లో చూస్తూ వస్తున్నాం. కానీ, ఒక్క డైలాగ్ కూడా తప్పు ధ్వనించకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే అల్లు అర్జున్ కూడా చాలా సెటిల్డ్ గా ఎక్కడా ఓవర్ అనిపించకుండా ప్లే చేశారు. ఒక మాస్ హీరోగా మాసివ్ లుక్ కోసం అల్లు అర్జున్ పెట్టిన ఎఫర్ట్స్ స్క్రీన్ మీద అద్భుతంగా కనిపించాయి. 

Pushpa 2: ఇక రష్మిక.. సినిమా మొత్తంలో కనిపించేది కొన్ని సీన్స్ మాత్రమే. కానీ కనిపించిన ప్రతి సీన్ లోనూ తనదైన ముద్ర వేసింది రష్మిక. డీగ్లామరస్ గా కనిపిస్తూనే.. అల్లు అర్జున్ తో మంచి కెమిస్ట్రీని పండించింది. సుకుమార్ భార్యాభర్తల బంధం అంటూ కొత్తగా మాస్ సినిమాలో చేసిన ప్రయోగానికి రష్మిక-అల్లు అర్జున్ జోడీ ప్రాణం పోసింది. రొమాన్స్ కీ అసభ్యతకీ ఉండే సన్నని గీతని దాటిపోతోన్న మాస్ సినిమాల ధోరణికి భిన్నంగా సున్నితమైన రొమాన్స్ తో.. ఇద్దరూ చేసిన సీన్స్ ఒక వర్గం ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి. 

Pushpa 2: ఒక పాట.. ఒక ఫైట్ లాంటి రొట్ట రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి.. పాటలను ఎక్కడ ఎలా వాడుకోవాలో అక్కడ అలా వాడుకున్న విధానం కొత్తగా ఉంది. ముఖ్యంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ సాంగ్ తో పాటుగా గ్యాప్ లేకుండా వచ్చిన శ్రీవల్లి సాంగ్ సినిమాలో విషయాన్ని బాగా ఎలివేట్ చేసింది. సినిమా గమనాన్ని మార్చేసే సీన్స్ ముందు ఈ రెండు పాటలు వరుసగా వచ్చినా ఎక్కడా ప్రేక్షకులకు ఇబ్బంది అనిపించకపోవడం సుకుమార్ స్క్రీన్ ప్లే గొప్పతనమే అని చెప్పవచ్చు. 

Pushpa 2: సినిమా ఎత్తుకోవడమే.. హీరో చిన్నతనంలో కోల్పోయిన ఇంటిపేరుతో మొదలు పెట్టి.. ఆ ఇంటిపేరుతోనే స్టోరీని ముగించి.. ఆవిషయం కోసం మధ్యలో హీరో పడే మధనం.. కుటుంబం చెందే వ్యధను యాక్షన్ సన్నివేశాల మధ్య పేర్చి.. వాటితోనే సినిమాని పరుగులెత్తించడం సుకుమార్ లెక్కల ఫార్ములా దర్శకత్వ ప్రతిభగా కనిపిస్తుంది. చెప్పడం కాదు కానీ, సినిమాలో ఈ మేజిక్ భలేగా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. 

Pushpa 2: ప్రయోగాత్మక సినిమాలు అంటూ ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. వాటి రీచ్ ప్రయోగం చుట్టూ తిరుగుతుంది అంతే. కానీ, ఇంత భారీ బడ్జెట్ సినిమాలో ప్రయోగాత్మక స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ చేయాలి అనే ఊహే పుష్ప 2 సినిమాకు ప్రాణం. ఏమాత్రం తేడా కొట్టినా వచ్చే ఫలితం వేరుగా ఉంటుంది. అందుకే ఆ గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే, ఈ సినిమాలో కథేమీ లేదు. కేవలం కథనమే.. అందులోని కొత్తదనమే. సన్నివేశాలను పేర్చుకుంటూ వాటిని అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గట్టుగా మలచుకుంటూ వెళ్లడంలో సుకుమార్ చాక చక్యం కనిపించింది.

Pushpa 2: ఇక అన్నిటికన్నా చివరగా చెప్పినా.. ఇదే అత్యంత ముఖ్యమైనది. ఇటీవల బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో చాలా సన్నివేశాలు చూడటానికి ఇబ్బంది పడేలా ఉన్నాయనేది వాస్తవం. ఇదే రష్మిక ఆ సినిమాలో కనిపించిన విధానమూ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ వరల్డ్ వైడ్ స్కోప్ ఉన్న సినిమాగా వచ్చిన పుష్ప 2 లో అటువంటి సన్నివేశాలు.. డైలాగులు లేకుండా క్లీన్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా రొమాన్స్ ఘాటు కనిపించింది. కానీ, అది యానిమల్ లా కాదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా గమనమే మారిపోయింది.

ప్రతి సన్నివేశం కళ్ళు ఆర్పకుండా చూస్తాం. ఇప్పటివరకూ వచ్చిన మాస్ సినిమాల్లో హీరో కత్తి పట్టుకుని రప్పా రప్పా జనాలని నరికేస్తుంటే.. సీట్లో ఇబ్బందిగా కదలడమో ఇదెక్కడి బాదుడు అనుకోవడమే కచ్చితంగా జరిగేది. చాలా సూపర్ హిట్ సినిమాల్లో కూడా ఇలాంటి ఊచకోత సీన్స్ చూసినపుడు అబ్బా ఎందుకొచ్చిన సీన్లు అనిపించేది. కానీ, ఈ సినిమాలో క్లైమాక్స్ లో హీరో ఒక్కోడినీ రప్పా రప్పా అంటూ దెబ్బలు కొడుతూ పోతుంటే.. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఇంకా కొట్టు.. వేసేయ్ ఒక్కోడినీ అనడం థియేటర్ లో వినిపించింది. ఆ యాక్షన్ సీన్ అయిపోయాకా (ఇది దాదాపు 10 నిమిషుల పైనే ఉన్నట్టుంది.) అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. సుకుమార్ అండ్ బన్నీ కల్సి చేసిన ప్రేక్షక హృదయాల ఊచకోత గురించి చెప్పడానికి. 

వివాదాలు.. ట్రోల్స్.. ఎవరు గొప్ప.. ఎవరు తక్కువ.. ఇలాంటివన్నీ పక్కన పెట్టి సినిమా చూస్తే మంచి కిక్ రావడం గ్యారెంటీ.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *