Marine Fishing Ban: ఆంధ్రప్రదేశ్ తూర్పు తీర ప్రాంతాల్లో చేపల వేట నిషేధానికి సమయం ఆసన్నమైంది. ఏటాదీ మే 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేటను నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సంవత్సరం ఈ నిషేధం మే 15కు ముందే, ఏప్రిల్ 15 అర్థరాత్రి నుంచే అమలులోకి వచ్చింది. ఈ నిషేధం పూర్తి స్థాయిలో అమలు కావాలని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
మత్స్యసంపద పరిరక్షణే లక్ష్యం
రొయ్యలు, చేపలు, ఇతర జలచరాలు ఈ కాలంలో గుడ్లు పెట్టే సమయం కావడంతో, వాటి పెరుగుదల కోసం ఈ నిషేధం అవసరమవుతుంది. వేట నిలిపివేస్తే జలవనరులు పునరుత్పత్తి అవుతాయి, తద్వారా మత్స్యకారులకు భవిష్యత్తులో మెరుగైన ఆదాయం లభించే అవకాశముంటుంది. ఈ కారణంగానే మత్స్యశాఖ నిబంధనలు కఠినంగా అమలు చేయనుంది.
వేటకు నిషేధం – ఎవరికి వర్తిస్తుంది?
ఈ నిషేధం మెకనైజ్డ్ బోట్లు, మోటార్ బోట్లు, మర పడవలకు వర్తిస్తుంది. అయితే, కర్ర తెప్పలు, కొన్ని సాంప్రదాయ పడవలకు మాత్రం మినహాయింపు ఉంది. అనకాపల్లి జిల్లాలోని పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి తదితర మండలాల్లో మొత్తం 2,360 ఇంజిన్ తెప్పలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 80 వేల జనాభాలో సుమారు 14 వేల మందికిపైగా మత్స్యకారులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Crime News: వరుడి ముందే వధువుపై సామూహిక అత్యాచారం
65 మండలాల్లో 8.5 లక్షల మందికి పైగా మత్స్యకారులు
ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంతా కలుపుకొని చూస్తే, తడ (తిరుపతి) నుంచి ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) వరకు 1,027 కిలోమీటర్ల సముద్రతీరంలో 555 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఇందులో 8.50 లక్షలమందికి పైగా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. వీరిలో 1.63 లక్షలమంది సముద్ర వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
మత్స్యకార భరోసా: రూ.20 వేలు నగదు సాయం
చేపల వేట నిషేధం సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు ప్రభుత్వం ‘మత్స్యకార భరోసా’ కింద రూ.20 వేలు చొప్పున నగదు అందించనుంది. గతంలో బియ్యం రూపంలో ఇచ్చిన ఈ సాయం, ఇప్పుడు నేరుగా డబ్బుగా ఇవ్వబడుతుంది. అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు సర్వే చేపడుతున్నారు.
నిబంధనల ఉల్లంఘనకు కఠిన చర్యలు
వేట నిషేధాన్ని ఉల్లంఘించే మత్స్యకారులపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం తోపాటు, సంక్షేమ పథకాల నుండి మినహాయించే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసుల ద్వారా తీరప్రాంతాల్లో గస్తీ పెంచారు. వేట నిషేధం అమలును పర్యవేక్షించేందుకు అధికారులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.