Shammi Kapoor: ‘రాక్ స్టార్’ అని ఇప్పుడు ఎవరంటే వారు పిలిపించుకుంటున్నారు. కానీ, ఇండియాలో ఫస్ట్ రాక్ స్టార్ గా జేజేలు అందుకున్నది మాత్రం షమ్మీకపూర్ అనే చెప్పాలి. ఆయన డాన్సులు చూసి ‘ఎల్విస్ ప్రిస్లీ ఆఫ్ ఇండయా’గా కీర్తించారు జనం. తండ్రి పృథ్వీరాజ్ కపూర్ మేటి నటుడు, అన్న రాజ్ కపూర్ టాప్ స్టార్… వారిద్దరి బాణీ తనపై పడకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు షమ్మీ కపూర్. ఆయన నటించిన అనేక చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఒకానొక దశలో అన్న రాజ్ కపూర్ నే మించిపోయారు షమ్మీ అని జనం అన్నారు. తరువాతి రోజుల్లో భారీగా శరీరం పెరిగిపోవడంతో కేరెక్టర్ రోల్స్ తో సాగారు షమ్మీ కపూర్. ‘రాక్ స్టార్’గా పేరొందిన షమ్మీ కపూర్ తన అన్న రాజ్ కపూర్ మనవడు రణబీర్ కపూర్ నటించిన ‘రాక్ స్టార్’ సినిమాలో చివరగా కనిపించడం విశేషం! అక్టోబర్ 21న షమ్మీ కపూర్ జయంతి. ఈ సందర్భంగా అభిమానులు షమ్మీ చిత్రాల్లోని పాటలను తలచుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.
