Gunfire: శ్రీ సత్యసాయి జిల్లాలో తుపాకీ కాల్పుల మోత కలకలం రేపింది. సినీఫక్కీని తలపించే విధంగా ద్విచక్రవాహనాలపై వెళ్తున్న వారిని పట్టుకునేందుకు కొంత మంది రెండు కార్లతో వెంబడిస్తూ కాల్పులు జరిపారు. ఇదంతా చూస్తున్న స్థానికులకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన బత్తలపల్లి మండలం రామాపురం గ్రామం జాతీయ రహదారిపై జరిగింది. మొదట రామాపురం జాతీయ రహదారిపై ఉన్న బస్‌స్టాప్ వద్దకు ద్విచక్ర వాహనాల్లో నలుగురు దొంగలు వచ్చారు. సమాచారం తెలుసుకున్న కొందరు వారిని పట్టుకునేందుకు రెండు కార్లతో వెంబడించారు.
ఈ క్రమంలో దొంగలను పట్టుకునేందుకు కాల్పులు జరిపారు. గాల్లోకి కాల్పులు జరుపుకుంటూ వెంబడించడంతో ద్విచక్ర వాహనాల్లో నలుగురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పులు జరిపిన వారు పోలీసులుగా స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు మిగతా పోలీసు సిబ్బంది హుటాహుటిన రామాపురం గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. స్థానికులతో మాట్లాడి ఘటన గురించి మరింత సమాచారం తెలుసుకున్నారు.
కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసులు వెంబడించినట్టు నిర్ధారించారు. రామాపురం హైవేపై రెండు బైక్‌లపై వెళ్తున్న నలుగురు దొంగలను లొకేషన్ ఆధారంగా రెండు కార్లలో వచ్చిన తెలంగాణ పోలీసులు వెంబడించారని తెలిపారు. దొంగలు తప్పించుకుని మరో మార్గంలోకి వెళ్తుండటంతో గాల్లోకి కాల్పులు జరిపారని, ఒకరు పట్టుబడగా మిగతా ముగ్గురు పరారయ్యారని పోలీసులు వివరించారు.