Fire Accident: తిరుపతి జిల్లా రేణిగుంట పారిశ్రామికవాడలో గురువారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలోని మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న డెక్సన్ మొబైల్ కంపెనీ వరకు మంటలు వ్యాపించే ప్రమాదం తలెత్తింది.
సాక్షుల వివరాల ప్రకారం, ప్రమాదం రాత్రి 2.30 గంటల సమయంలో జరిగింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది దాదాపు 10 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దించి, మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చేది ఎప్పుడంటే..!
ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన లిథియం బ్యాటరీలు, మిషనరీ, ముడి పదార్థాలు పూర్తిగా కాలిపోయాయి. యాజమాన్యం అంచనాల ప్రకారం, ఈ ఘటనలో సుమారు ₹70–80 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రాథమిక దర్యాప్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్టు భావిస్తున్నారు. అయితే, ఖచ్చితమైన కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
ఈ అగ్నిప్రమాదం వల్ల పారిశ్రామిక వాడ మొత్తం ఆందోళనకు గురైంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.