Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారి వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. తాజా లెక్కల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 51,92,220 గా నమోదైంది. ఇందులో మహిళా ఓటర్లు 25,37,136 మంది కాగా, పురుష ఓటర్లు 26,54,453 మంది ఉన్నారు. ఇతరులు 631 మందిగా తేలింది.
ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు వేగవంతం చేసింది. కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షలు నిర్వహించిన ఎన్నికల సంఘం, జనవరి 13న (మంగళవారం) పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది. అనంతరం, ఈ నెల 16న ఫోటోలతో కూడిన పూర్తి స్థాయి ఫైనల్ ఓటర్ లిస్టును ప్రజలందరికీ అందుబాటులో ఉంచనున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
మరోవైపు, ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా కఠిన నిబంధనలను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజకీయ పార్టీలు తమ ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ముందే సమర్పించాలని ఆదేశించింది. గుర్తింపు పొందిన పార్టీలకు 20 మందిని, రిజిస్టర్ అయిన ఇతర పార్టీలకు 5 గురు స్టార్ క్యాంపెయినర్లను మాత్రమే అనుమతిస్తారు. ప్రచార ఖర్చుల విషయంలో కూడా నిబంధనలు కఠినంగా ఉన్నాయి. స్టార్ క్యాంపెయినర్ల కోసం చేసే ఖర్చును నేరుగా అభ్యర్థి ఖాతాలోనే జమ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
