Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేశ్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి చేసిన మొక్కును తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆయన, ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టయిన సమయంలో బండ్ల గణేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబుపై ఉన్న అభాండాలు తొలగిపోయి, ఆయన క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటూ సుప్రీంకోర్టు గడపపై నిలబడి తాను తిరుమల స్వామివారికి మొక్కుకున్నట్లు ఆయన వెల్లడించారు.
“నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర చేస్తా” అని ఆ రోజున తాను పెట్టుకున్న మొక్కును నెరవేర్చుకునే సమయం ఆసన్నమైందని గణేశ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అఖండ విజయం సాధించి పూర్వ వైభవాన్ని పొందడం, ఇటీవలే ఆయనపై ఉన్న కేసులన్నీ కొట్టేయడంతో తన మనసు కుదుటపడిందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి ఈ ‘సంకల్ప యాత్ర’ను ప్రారంభించబోతున్నారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని, ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి ఈ సుదీర్ఘ నడకను ఆయన మొదలుపెట్టనున్నారు.
Also Read: Chandrababu Naidu: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ ఏమన్నారంటే?
ఈ యాత్ర గురించి బండ్ల గణేశ్ స్పందిస్తూ, ఇది ఏమాత్రం రాజకీయ యాత్ర కాదని స్పష్టం చేశారు. తన మాట ఆలకించి తన కోరికను నెరవేర్చిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి చెల్లించుకుంటున్న భక్తిపూర్వక మొక్కుబడి అని ఆయన తెలిపారు. తన కుటుంబ సభ్యులు కూడా ఈ మొక్కును గుర్తు చేయడంతో, శేషాచలం కొండ పిలుపు మేరకు నడక మార్గాన వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని నిశ్చయించుకున్నారు. షాద్‌నగర్ నుండి తిరుమల వరకు సాగే ఈ పాదయాత్ర ఇప్పుడు అటు సినీ ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది. తన నాయకుడి పట్ల ఉన్న అభిమానాన్ని, దైవం పట్ల ఉన్న నమ్మకాన్ని చాటుకుంటూ సాగనున్న ఈ సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
ఓం నమో వెంకటేశాయః..
మీ సంకల్ప యాత్ర.. స్పూర్తివతంగా నిలవాలని ఆశిస్తున్నాం.. @ganeshbandla గారు..#sankalpayatra #BandlaGanesh pic.twitter.com/MIBCO6uDHw— SZN (@Suzenbabu) January 18, 2026

