Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదం ఒక ఫీల్డ్ అసిస్టెంట్ హత్యకు దారితీసింది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం అలూరుకు చెందిన కురువ బండారి ఈరన్న ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే అ పదవి విషయంలో కొంతకాలంగా గ్రామంలో వివాదాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మరికొందరు ఈరన్నను రాజీనామా చేయాలని గత రెండునెలలుగా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అయితే ఈరన్న ససేమిరా అనడంతో వివాదం మరింత ముదిరి హత్యకు దారితీసింది.
కురువ బండారి ఈరన్న ఉపాధి పనులు చేయించేందుకు వెళుతుండగా కాపు కాచి ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గత కొంత కాలంగా ఈరన్నను ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరస్తున్న వ్యక్తులే ఆయనను హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాగా ఈరన్న హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అవసరమైన చర్యలు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

