Suryapet: భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. కానీ, కొన్నిసార్లు ఈ గొడవలు హద్దులు దాటి, ప్రాణాలను బలి తీసుకుంటాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ విషాద ఘటన ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవకు ఏడాది వయసున్న పసిపాప ప్రాణం కోల్పోయింది.
ఏం జరిగింది?
సూర్యాపేటలోని ప్రియాంక కాలనీలో వెంకటేష్, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భవిజ్ఞ అనే ఏడాది వయసున్న కూతురు ఉంది. కొంతకాలంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి వెంకటేష్ మద్యం తాగి ఇంటికి రావడం వల్ల మరోసారి గొడవ మొదలైంది.
వారు అరుచుకుంటున్న శబ్దాలకు భయపడి చిన్నారి భవిజ్ఞ ఏడవడం మొదలుపెట్టింది. పాప ఏడుపు చుట్టుపక్కల వారికి వినబడుతుందని కోపంతో ఊగిపోయిన తండ్రి వెంకటేష్, చిన్నారి నోటిని గట్టిగా మూశాడు. దీంతో పాప ఊపిరాడక ఇబ్బంది పడింది. తన కూతురు ప్రాణాలు కోల్పోతుందని భయపడిన నాగమణి, భర్త చేతిని తొలగించడానికి ప్రయత్నించింది.
కన్న కూతురనే కనికరం లేకుండా వెంకటేష్, ఆవేశంతో పాపను నేలకు విసిరి కొట్టాడు. ఆ చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
పసిపాప మరణం
కూతురు అచేతనంగా పడిపోవడం చూసి నాగమణి గట్టిగా ఏడ్చింది. ఆమె ఏడుపులు విని బయటకు వచ్చిన చుట్టుపక్కల వారు, రక్తస్రావంతో పడి ఉన్న చిన్నారిని చూసి వెంటనే సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, చికిత్స పొందుతూ ఆ పసిపాప తుదిశ్వాస విడిచింది.
ఈ దారుణ ఘటన తర్వాత వెంకటేష్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ అమానవీయ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.