Plane Crash: ఆఫ్రికా దేశం కెన్యాలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 12 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన క్వాలే కౌంటీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పర్యాటకులను మాసాయి మారాలోని కిచ్వా టెంబో ప్రాంతానికి తీసుకెళ్లేందుకు క్వాలేలోని డయాని ఎయిర్‌స్ట్రిప్ నుండి బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది.
అధికారుల ధృవీకరణ:
కెన్యా పౌర విమానయాన అథారిటీ (KCAA) ఈ ప్రమాదాన్ని అధికారికంగా ధృవీకరించింది. 5Y-CCA రిజిస్ట్రేషన్ సంఖ్య కలిగిన ఈ విమానం ఉదయం 8:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంతంలో కూలిపోయినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ మరణించారని అధికారులు ధ్రువీకరించారు. మరణించిన వారంతా విదేశీ పర్యాటకులేనని పోలీసులు తెలిపారు.
Also Read: Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం: 107 రైళ్లు రద్దు.. వివరాలివే
ప్రమాద కారణాలపై దర్యాప్తు
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వ అధికారులు, అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానం కూలడానికి గల కారణాలను, దాని ప్రభావాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. KCAA డైరెక్టర్ ఎమిలే ఎన్.రావు మాట్లాడుతూ, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు.
అయితే, ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడనప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ విషాదం జరిగిందని స్థానిక మీడియా కథనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తీర ప్రాంతంలో దట్టమైన పొగమంచు, మేఘాలు అలుముకుని ఉండటం వల్ల, పైలట్‌కు సరిగ్గా కనిపించక (విజిబిలిటీ తగ్గి), విమానంపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని స్థానిక వర్గాలు భావిస్తున్నాయి. ప్రమాదంపై కెన్యా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

