Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక మహిళ సహా ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. గొల్లపల్లి అటవీ ప్రాంతంలోని కొండలపై మావోయిస్టులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో, జవాన్లు కూడా దీటుగా స్పందించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారు కిస్టారం ఏరియా కమిటీకి చెందిన సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుండి భారీగా ఆయుధాలు, ఇతర సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
Also Read: Nara Lokesh: మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్ట్.. మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద ప్రకటన!
ప్రస్తుతం ఆ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మరికొందరు మావోయిస్టులు గాయపడి ఉండవచ్చని, వారు దట్టమైన అడవిలోకి పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో సుక్మా జిల్లా అంతటా భద్రతను మరింత కఠినతరం చేశారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు ప్రక్రియ ముగిసిన తర్వాత పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.
