Andhra King Taluka OTT: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ డిజిటల్ సందడికి రంగం సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినా నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీ నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
ఈ సినిమా కథాంశం ఒక స్టార్ హీరో, అతని వీరాభిమాని చుట్టూ తిరుగుతుంది. ‘ఆంధ్రా కింగ్’గా పిలవబడే సూపర్ స్టార్ సూర్య (ఉపేంద్ర) తన ప్రతిష్టాత్మక 100వ సినిమాను ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తి చేయలేక సతమతమవుతుంటాడు. ఆ సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి అతని బ్యాంకు ఖాతాలో ఏకంగా మూడు కోట్ల రూపాయలను జమ చేస్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, సూర్యకు వీరాభిమాని అయిన సాగర్ (రామ్ పోతినేని). తన అభిమాన హీరో కోసం అంత పెద్ద మొత్తాన్ని సాగర్ ఎలా సేకరించాడు? అతని జీవితంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? తన ప్రేయసి మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే) తో ఉన్న ప్రేమ కథకు, ఈ హీరో-ఫ్యాన్ బంధానికి ఉన్న సంబంధం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో దర్శకుడు మహేష్ బాబు పి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Also Read: The Paradise: ‘ది పారడైజ్’లో బిర్యాని ఎంట్రీ: టెర్రిఫిక్ లుక్‌లో సంపూర్ణేష్ బాబు
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ ద్వయం సంగీతాన్ని అందించారు. సినిమాలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. నవంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సుమారు 32 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి మంచి రెస్పాన్స్ అందుకుంది. రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్, భాగ్యశ్రీ బోర్సే నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. వెండితెరపై ‘బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్’గా మెప్పించిన ఈ చిత్రం, ఇప్పుడు బుల్లితెరపై కూడా అదే స్థాయి ఆదరణ పొందుతుందని చిత్ర బృందం భావిస్తోంది.

