Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా గౌకనపేటలో నాలుగేళ్ల చిన్నారి హర్షవర్ధన్ హత్య ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బుధవారం నుంచి కనిపించకుండా పోయిన బాలుడు మరుసటి రోజు ఉదయం మృతదేహంగా కనిపించడం గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ ఘటన వెనుక బంధువు మేనత్త భర్త ప్రసాద్ ఉన్నట్లు నిర్ధారించారు.
గంగాధర్, ఆయన భార్య తమ కుమారుడు హర్షవర్ధన్ కనిపించకపోవడంతో బుధవారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఉదయం గ్రామ పరిసర ప్రాంతాల్లో మృతదేహాన్ని గుర్తించారు. బాలుడిని మేనత్త భర్త ప్రసాద్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు డీఎస్పీ శివనారాయణస్వామి స్పష్టం చేశారు.
Also Read: Fish Canteen: హైదరాబాద్‌లో మరో ఫిష్ క్యాంటీన్.. నిరుద్యోగులకు మంచి అవకాశం..!
నిందితుడు ప్రసాద్ తన కుమారుడు క్యాన్సర్‌తో పోరాడుతున్న నేపథ్యంలో వైద్య ఖర్చులకు డబ్బులు కావాలని బావమరిది గంగాధర్‌ను అడిగినట్టు తెలుస్తోంది. సహాయం చేయలేదన్న అసహనం పెద్ద కక్షగా మారి, ఆగ్రహంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎస్‌ఐ నరసింహుడు వెల్లడించారు. బుధవారం ఉదయం బాలుడిని అపహరించి, అనంతరం హత్య చేయడం ద్వారా కుటుంబానికి తిరిగి నెరవేరని నష్టాన్ని మిగిల్చాడు. ఈ దారుణం బంధుత్వానికే మచ్చతెచ్చే విధంగా మారింది. చిన్నారి ప్రాణం తీసిన ఘటనపై మొత్తం గ్రామం షాక్‌కు గురైంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

