Fake IAS

Fake IAS: నకిలీ ఐఏఎస్‌ దందా.. హైదరాబాద్‌లో బడా మోసం గుట్టు రట్టు!

Fake IAS: హైదరాబాద్‌లో ఐఏఎస్ అధికారిగా నటిస్తూ బడాబాబులను మోసం చేస్తున్న ఒక ఘరానా మోసగాడి ఆట కట్టించారు పోలీసులు. బత్తిని శశికాంత్ (39) అనే వ్యక్తి తాను ఐఏఎస్, ఐపీఎస్, చివరికి ఎన్ఐఏ అధికారినని చెప్పుకుంటూ కొన్నేళ్లుగా దందాను నడిపాడు. ఆంధ్రప్రదేశ్, నందికొట్కూరుకు చెందిన ఈ వ్యక్తి షేక్‌పేట్‌లోని అపర్ణ ఔరా అపార్ట్‌మెంట్‌లో మకాం ఉంటూ తన మోసాలకు పాల్పడ్డాడు. రెండేళ్లుగా ఈ దందా సాగుతున్నా, ఇన్నాళ్లూ నిఘా వర్గాలు గుర్తించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

శశికాంత్ తన నకిలీ అధికారి వేషానికి మరింత ఆడంబరం జోడించాడు. తమిళనాడుకు చెందిన ఇద్దరు రిటైర్డ్ సీఆర్పీఎఫ్ జవాన్లను గన్‌మెన్‌లుగా పెట్టుకున్నాడు. చేతిలో వాకీటాకీలు, కారుకు సైరన్ అమర్చుకొని, నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ ఐడీ కార్డులను చూపించి హల్చల్ చేసేవాడు. ఈ వాతావరణాన్ని చూసి, ప్రముఖ వ్యాపారులు, ధనవంతులు ఇతను నిజమైన అధికారి అని నమ్మేశారు. తాను డిప్యూటీ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ అని కూడా చెప్పుకుంటూ అనేక మంది దగ్గర భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు.

ఈ మోసం చివరికి ఒక జిమ్ ఓనర్ ఫిర్యాదుతో బయటపడింది. ఓ భూమిని అలైన్‌మెంట్ చేయిస్తానని నమ్మించి, జిమ్ యజమాని దగ్గర రూ. 10.50 లక్షలు, జిమ్‌కి వెళ్ళే మరో వ్యక్తి దగ్గర రూ. 10 లక్షలు వసూలు చేశాడు శశికాంత్. డబ్బు తీసుకున్న తర్వాత అతను తప్పించుకొని తిరుగుతుండడంతో, మోసపోయామని గ్రహించిన జిమ్ యజమాని ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి శశికాంత్ నకిలీ ఐఏఎస్ నాటకాన్ని రట్టు చేశారు.

పోలీసులు వెంటనే శశికాంత్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో రెండు సెల్‌ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, వాకీటాకీలు, అలాగే నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ ఐడీ కార్డులు ఉన్నాయి. ఉన్నతాధికారులమని చెప్పుకుంటూ అమాయకులను, ధనవంతులను టార్గెట్ చేసే ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *