Vittalacharya: జానపద చిత్రాలు అనగానే తెలుగువారికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు జానపద బ్రహ్మ బి.విఠలాచార్యదే… రాజకీయ ఎత్తులు-పైఎత్తులతోనే కాదు మాయలూ మంత్రాలతోనూ విఠలాచార్య చిత్రాలు తెలుగువారిని పరవశింప చేశాయి… జనవరి 28న బి.విఠలాచార్య జయంతి… ఈ సందర్భంగా ఆయన బాణీని మననం చేసుకుందాం…
తెలుగునాట విఠలాచార్య జానపదాలు సందడి చేసిన తీరే వేరు… విఠలాచార్య సినిమా వస్తోందంటే చాలు ఆ రోజుల్లో జనం ఆసక్తికి లోనయ్యేవారు… ఆయన సినిమాలు రాగానే థియేటర్లకు పరుగులు తీసేవారు… అలా అధిక సంఖ్యలో జానపద చిత్రాలతో అలరించిన ఘనత విఠలాచార్యదే…
విఠలాచార్య కన్నడనాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి తెలుగువారిని విశేషంగా అలరించారు. కన్నడ, తమిళ భాషల్లో చిత్రాలు రూపొందించిన తరువాతే తెలుగులో అడుగుపెట్టారు ఆచార్య. తెలుగులో మొదట సాంఘిక చిత్రాలనే తెరకెక్కించారు. ‘కనకదుర్గ పుజా మహిమ, వరలక్ష్మీ వ్రతం’ వంటి భక్తి రస చిత్రాలతో తెలుగునాట ఆచార్యకు గుర్తింపు లభించింది. జానపదంలో ‘బందిపోటు’తో తనదైన బాణీ పలికించారు విఠలాచార్య. యన్టీఆర్ తో విఠలాచార్య తెరకెక్కించిన తొలి చిత్రం ‘బందిపోటుల’. ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. విఠలాచార్య తరువాతి రోజుల్లో జైత్రయాత్ర చేయడానికి ‘బందిపోటు’ దన్నుగా నిలచిందని చెప్పాలి…
‘బందిపోటు’ ఘనవిజయంతో వరుసగా జానపద చిత్రాలతోనే సందడి చేయడం మొదలు పెట్టారు విఠలాచార్య… యన్టీఆర్ తో లేకపోతే కాంతారావుతో జానపదాలను రూపొందించారు… కాంతారావుకు ‘కత్తి కాంతారావు’గా పేరు సంపాదించి పెట్టింది విఠలాచార్య చిత్రాలే. రామారావు తరువాత కాంతారావుతోనే ఎక్కువ చిత్రాలు రూపొందించారు విఠలాచార్య… ఆయన చిత్రాలలో కృష్ణకుమారి రాకుమారి పాత్రల్లో భలేగా అలరించారు…
యన్టీఆర్, కాంతారావు కంటే ముందు హరనాథ్ కథానాయకునిగా ‘మదన కామరాజు కథ’ తెరకెక్కించారు విఠలాచార్య… ఆ సినిమా ఆట్టే అలరించలేకపోయినా, అందులోని నీలి మేఘమాలవో…” పాట అలరిస్తూనే ఉంటుంది… ఈ పాటకు ‘చౌద్వీ కా చాంద్’లోని టైటిల్ సాంగ్ బాణీలు ఆధారం… ‘మదన కామరాజు కథ’ అనగానే ఆ పాటనే ముందుగా గుర్తుకు వస్తుంది…
విఠలాచార్య తెరకెక్కించిన ‘ఇద్దరు మొనగాళ్ళు’ చిత్రంలో కాంతారావు, కృష్ణ హీరోలుగా నటించారు… ఈ చిత్రం తీసే సమయానికి కృష్ణ వర్ధమాన కథానాయకుడు… ఇందులో కృష్ణకు మంచి పాత్ర లభించింది… దీంతో ఆయనకు తగిన గుర్తింపూ దక్కింది… విఠలాచార్య దర్శకత్వంలో కృష్ణ నటించిన ఏకైక చిత్రం ‘ఇద్దరు మొనగాళ్ళు’ కావడం విశేషం…
జానపద బ్రహ్మగా జనం మదిలో నిలచిన విఠలాచార్య ఆరంభంలో కొన్ని సాంఘిక చిత్రాలూ రూపొందించారు… అయితే అవేవీ అంతగా అలరించలేక పోయాయి… అయినప్పటికీ సదరు చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు విఠలాచార్య… విఠలాచార్య సాంఘిక చిత్రాలలో ‘ఖైదీ కన్నయ్య’ బాగా ఆకట్టుకుంది… ఏ చిత్రాన్నయినా అనుకున్న సమయంలో, తగిన బడ్జెట్ తో తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు విఠలాచార్య… అందువల్లే ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు తరువాతి రోజుల్లో విఠలాచార్య ఫార్ములా అంటూ ఆయన ప్రణాళికను కీర్తించేవారు…
విఠలాచార్య సాంఘిక చిత్రాలు రూపొందించినా, ఆయనకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది జానపదాలే… యన్టీఆర్, కాంతారావు హీరోలుగా విఠలాచార్య తెరకెక్కించిన అనేక జానపదాలు జనం మదిని గెలిచాయి… తరువాతి రోజుల్లోనూ తనకు దొరికిన హీరోలతో జానపదాలు రూపొందిస్తూ సాగారు విఠలాచార్య… ఆ చిత్రాలు సైతం ప్రేక్షకులను మురిపించాయి…
బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షాలు కురిపించిన విఠలాచార్య చిత్రాలను తీసుకుంటే, వాటిలో యన్టీఆర్ సినిమాలే అధికంగా కనిపిస్తాయి… మొదట్లో ఫ్లాప్ టాక్ సంపాదించిన కొన్ని యన్టీఆర్-విఠలాచార్య సినిమాలు తరువాతి రోజుల్లో విశేషాదరణ చూరగొన్నాయి… ఆ మాటకొస్తే, నిర్మాతలకు లాభాలే చూపించాయి… అందుకే నేటికీ యన్టీఆర్-విఠలాచార్య కాంబో సినిమాలకు బుల్లితెరపైనా ఎనలేని క్రేజ్ ఉందని చెప్పవచ్చు…
మాయలు, మంత్రాలతో అలరించడమే కాదు… పాటల చిత్రీకరణలోనూ విఠలాచార్య తనదైన బాణీ పలికించారు… సందర్భానికి తగ్గ పాటలు రాయించుకోవడమే కాదు, వాటిని తెరకెక్కించడంలోనూ విఠలాచార్య మార్కు కనిపిస్తుంది…
యన్టీఆర్ తో విఠలాచార్య తెరకెక్కించిన తొలి చిత్రం ‘బందిపోటు’లోనే పాటలతో అలరించారు… ఇందులో రాత్రిపూట వసంత మంటపంలో హీరోయిన్ ను టీజ్ చేస్తూ హీరో గుర్రం మీద ఎక్కి పాడే పాట అప్పట్లో జనాన్ని విశేషంగా ఆకర్షించింది… కుర్రాళ్ళు ‘వగలరాణివి నీవే…’ అంటూ ప్రియురాళ్ళను ఆటపట్టించడమూ సాగింది… ‘జ్వాలాద్వీప రహస్యం’లోనూ “చుక్కలన్ని చూస్తున్నాయి…” పాట ఇప్పటికీ ఆకట్టుకొనేలా రూపొందించారు విఠలాచార్య…
నాటి అందాలతార జయలలిత నోట తెలుగు పాట పాడించిన ఘనత కూడా విఠలాచార్యదే… యన్టీఆర్, జయలలిత జంటగా ఆయన రూపొందించిన ‘ఆలీబాబా నలభై దొంగలు’లో జయలలితతో ఓ పాట పాడించి మురిపించారు ఆచార్య… ఘంటసాల మాస్టారు స్వరకల్పనలో జయలలిత గళం నుండి జాలువారిన తెలుగు పాట సంగీతాభిమానులకు గిలిగింతలు పెట్టింది…
విఠలాచార్య చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ కు కొదవే లేదు… వాటిని కూడా అదే పనిగా చొప్పించినట్టుగా కాకుండా, సందర్భానుసారంగా రూపొందించేవారు… ఆ పాటలు సైతం జనాన్ని భలేగా కవ్వించాయి…
డాన్స్ గాళ్స్ గా పేరొందిన వారికి కూడా తన సినిమాల్లో తగు పాత్రలు ఇచ్చారు విఠలాచార్య… వారిపై చిత్రీకరించిన పాటలతోనూ జనాన్ని భలేగా మురిపించారు ఆచార్య… ఈ నాటికీ ఆ పాటలు వింటున్నా, చూసినా కనువిందు కలుగక మానదు…
విఠలాచార్య సినిమాలు చాలా వరకు మ్యూజికల్ హిట్స్ .. అందువల్ల జనానికి నచ్చిన పాటలు తెరపై రాబోతూ ఉండగానే ప్రేక్షకులు ఈలలు వేసి గోల చేసేవారు… అలాంటి మ్యాజిక్ విఠలాచార్య చిత్రాల్లో సదా కనిపించేది…
యన్టీఆర్ తో విఠలాచార్య తెరకెక్కించిన జానపదాల్లో ఐటమ్ సాంగ్స్ కు కథలో చోటుండేది… వాటి ద్వారా కథను మరింత ముందుకు తీసుకు పోయేవారు… సదరు గీతాలను సైతం వినోదం పండిస్తూ రూపొందించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు విఠలాచార్య…
తన సినిమాల్లో మాయలూ, మంత్రాలూ చూపించడంలోనూ అనితరసాధ్యంగా నిలిచారు బి.విఠలాచార్య… హీరోను సైతం మాయతో మార్చి వేసి, జనం మెచ్చేలా పాటలను తెరకెక్కించారు ఆచార్య… అలా అనేక చిత్రాల్లో నటీనటులు సమయానికి అందుబాటులో లేకపోతే మాయ చేసి తన సినిమాకు అనువుగా సదరు పాటలను వినియోగించుకొనేవారు విఠలాచార్య…
ఎంతటి వారికైనా జయాపజయాలు తప్పవు… జానపదాలతో జైత్రయాత్ర చేసిన విఠలాచార్య గ్రాఫ్ సైతం ఒక్కసారిగా కూలిపోయింది… ఆపై పలు ప్రయోగాలు చేశారు… మళ్ళీ జానపదంతోనే మురిపించి పేరు నిలుపుకున్నారు…
విఠలాచార్య అనగానే అందరికీ ముందుగా ఆయన యన్టీఆర్ తో తెరకెక్కించిన చిత్రాలే గుర్తుకు వస్తాయి… యన్టీఆర్ తో 13 చిత్రాలు రూపొందించారు… అందులో పదికి పైగా చిత్రాలు బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచాయి… ‘అగ్గి-పిడుగు’లో యన్టీఆర్ తో ద్విపాత్రాభినయం చేయించారు… అందులోనూ పెద్దవానికి కలిగే అనుభూతి చిన్నవాడికీ కలుగుతూ ఉండడం, అతణ్ణి కొడితే ఇతడికీ దెబ్బ తగలడం అన్నవి సరదాగా ఉంటాయి… ఆ కథను ఆధారం చేసుకొని తరువాత కొన్ని సాంఘిక చిత్రాలూ రూపొంది, విజయం సాధించాయి…
యన్టీఆర్ తో విఠలాచార్య మూడు చిత్రాలలో ద్విపాత్రాభినయం చేయించారు… అవి “అగ్గి -పిడుగు, మంగమ్మ శపథం, గండికోట రహస్యం” ఈ మూడు చిత్రాలలోనూ కథను ఆయన నడిపించిన తీరు జనాన్ని ఈ నాటికీ ఆకట్టుకుంటూనే ఉంది… పాత కాలం ‘మంగమ్మ శపథం’ చిత్రానికి విఠలాచార్య కొత్త నగిషీలు చెక్కి రూపొందించిన తీరును ఎవరూ మరచిపోలేరు…
విఠలాచార్య దర్శకత్వంలో యన్టీఆర్ నటించిన మూడో ద్విపాత్రాభినయ చిత్రం ‘గండికోట రహస్యం’… ఈ సినిమా ఆ రోజుల్లో వసూళ్ళ వర్షం కురిపించింది… ఇక రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొనేది… ఆ మాటకొస్తే యన్టీఆర్ తో విఠలాచార్య తీసిన అన్ని సినిమాలూ రిపీట్ రన్స్ లో సత్తా చాటుకున్నాయనే చెప్పాలి… ఇక యన్టీఆర్, విఠలాచార్య కాంబోలోని పాటలు ఈ నాటికీ మురిపిస్తూనే ఉన్నాయి…
ఎందుకనో కానీ, బి.విఠలాచార్యకు సాంఘిక చిత్రాలు అంతగా అచ్చిరాలేదు… యన్టీఆర్ తో అనేక జానపద చిత్రాలు తెరకెక్కించి విజయం సాధించిన విఠలాచార్య , ఏయన్నార్ తో ‘బీదలపాట్లు’ సాంఘికం రూపొందించారు. నాగయ్య ‘బీదలపాట్లు’ చిత్రానికి ఇది రీమేక్…ఈ సినిమా పరాజయం పాలయింది… అయినా ఇందులోని పాటలు అలరించాయి.
తనకు అచ్చివచ్చిన యన్టీఆర్ తోనూ విఠలాచార్య ‘పల్టెటూరి చిన్నోడు’ అనే సాంఘికం రూపొందించారు… ఈ సినిమా కూడా విజయం సాధించలేకపోయింది… కన్నడ చిత్రం ‘చిన్నద గొంబె’ ఆధారంగా ‘పల్లెటూరి చిన్నోడు’ వెలుగు చూసింది… ఆరంభంలో ఈ చిత్రం అలరించలేక పోయినా, రిపీట్ రన్స్ లో యన్టీఆర్ ఇమేజ్ కారణంగా మురిపించింది…
పరాజయాలు పలకరిస్తున్న సమయంలో విఠలాచార్య లేడీ ఓరియెంటెడ్ మూవీగా ‘జగన్మోహిని’ అనే జానపదం రూపొందించారు… ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది… ఇందులో జయమాలిని ప్రధాన పాత్ర పోషించి మెప్పించారు… ఆ తరువాత వరుసగా ఆమెతో “గందర్వ కన్య, మదనమంజరి, నవమోహిని” వంటి చిత్రాలు తీసి మళ్ళీ జానపదాల్లో తనదైన బాణీ పలికించారు ఆచార్య…
‘జగన్మోహిని’ విజయం తరువాత వరుసగా జానపదాలతోనే సాగారు విఠలాచార్య… జై భేతాళ అనే త్రీడీ మూవీ కూడా రూపొందించారు… మోహన్ బాబు హీరోగా ‘వీరప్రతాప్’ అనే మాయల చిత్రాన్నీ తెరకెక్కించారు… అయితే ఆయన చివరి హిట్ మూవీగా ‘జగన్మోహిని’ నిలచింది… తరువాతి కాలంలో ఆ సినిమాకు రీమేక్ కూడా వచ్చింది… అంటే ‘జగన్మోహిని’ ప్రభావం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు..
తన జానపద చిత్రాలతో ఆబాలగోపాలాన్నీ అలరించారు విఠలాచార్య… ఇప్పటికీ ఆ సినిమాలు చూస్తే విఠలాచార్య ప్రతిభ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది… అందుకే ఆయనను జానపద బ్రహ్మ, మాయలవీరుడు అన్నారు.
