Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఎక్సైజ్ పోలీసులు, సిట్ (SIT) అధికారులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న అధికారులు నోటీసులు (కొన్ని వర్గాల ప్రకారం సెర్చ్ వారెంట్) ఇచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు కస్టడీలో ఇచ్చిన కీలక వాంగ్మూలం (స్టేట్‌మెంట్) ఆధారంగానే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. జనార్దనరావు తన విచారణలో, జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేశానని, అందుకు రమేష్ ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారని అధికారులకు వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగానే సిట్ అధికారులు నేడు అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు.
జోగి రమేష్ అరెస్ట్ సమయంలో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్ద భారీ ఉద్రిక్తత నెలకొంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోలీసుల చర్యను నిరసించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ హైడ్రామా మధ్యే పోలీసులు జోగి రమేష్‌ను అరెస్ట్ చేసి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.
Also Read: Aadhaar Card Updates: ఆధార్ అప్‌డేట్స్‌పై 2026 జూన్ వరకు అవకాశం
అరెస్ట్ అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ అరెస్ట్‌పై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, పేర్ని నాని, అంబటి రాంబాబుతో సహా పలువురు సీనియర్ నేతలు దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.
జోగి రమేష్ పేరును దురుద్దేశంతోనే ఈ కేసులో ఇరికించారని, కస్టడీలో ఉన్న జనార్దనరావు ద్వారా ఆయన పేరు చెప్పించారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నకిలీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ, ఆ పిటిషన్ విచారణకు రాకముందే అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట, తుపాన్ సహాయక చర్యలలో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ అరెస్ట్ జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపించారు.
జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా కొందరు టీడీపీ నాయకులను అరెస్ట్ చేయలేదని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రమేష్‌ను అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు వెల్లడించారు. ఈ ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వారు స్పష్టం చేశారు.

