AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం (లిక్కర్ స్కామ్) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో వైసీపీ నాయకులు, వారి వ్యాపార భాగస్వాముల పేర్లు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. గత వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు, అంటే జూలై 11, శుక్రవారం నాడు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
Also Read: NASA: ట్రంప్ కీలక నిర్ణయం.. నాసా నుండి 2000 మంది అవుట్..!
మద్యం పాలసీని రూపొందించడం దగ్గర నుంచి కమీషన్లు వసూలు చేసే ప్రక్రియ వరకు మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ హస్తం ఉన్నట్లు సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి (ఏ-1) మొత్తం అబ్కారీ శాఖను శాసిస్తుంటే, అప్పటి కీలక అధికారి అయిన రజత్ భార్గవ కనీసం అభ్యంతరం కూడా చెప్పకపోవడం దర్యాప్తు అధికారులను ఆశ్చర్యపరిచింది. ముడుపుల కారణంగానే ఆయన మౌనంగా ఉన్నారని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ రజత్ భార్గవ దారుణంగా వ్యవహరించారని సిట్ ప్రాథమికంగా తేల్చినట్లు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం అంచనా ప్రకారం, వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పేరుతో సుమారు రూ. 3,500 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని అనుమానిస్తోంది. దీనిపైనే సిట్ లోతుగా దర్యాప్తు జరుపుతోంది. రజత్ భార్గవ పాత్ర తేలడంతోనే సిట్ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు.